Hyderabad: వరదలకు టెక్నాలజీతో చెక్.. అధునాతన వ్యవస్థను రూపొందిస్తోన్న IIT హైదరాబాద్
వరదల కారణంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ముందుకొచ్చారు ఐఐటీ హైదరాబాద్. ఇందులో భాగంగానే అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఓ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టిన సభ్యులు ఇందుకోసం అవసరమైన డేటాను క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్...

వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాదీలు భయంతో వణికిపోతుంటారు. ఎప్పుడు ఏ ప్రాంతంతో కుంభవృష్టి కురుస్తుందో, ఎక్కడ వరదలు ఉప్పొంగుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. కేవలం కొద్ది క్షణాలు వర్షం కురిస్తే చాలు వరద ప్రభావితమయ్యే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సమస్య కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదు.. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోనూ ప్రతీ ఏటా వరద భయం ఆనవాయితీగా వస్తూనే ఉంది.
ఇక వరదల కారణంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ముందుకొచ్చారు ఐఐటీ హైదరాబాద్. ఇందులో భాగంగానే అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఓ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టిన సభ్యులు ఇందుకోసం అవసరమైన డేటాను క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ అండ్ క్లైమెట్ చేంజ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీశ్‌కుమార్ రేగొండ ఆధ్వర్యంలోని టీమ్ పనిచేస్తోంది.
భారీ వర్షాలు కురిసిన సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించడమే ఈ వ్యవస్థ ముఖ్య లక్ష్యమని చెబుతున్నారు. వరదల సమయాల్లో ప్రజలను కాపాడేందుకు అవసరమైన హెచ్చరిక వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం వర్షమిత్ర పేరుతో ప్రచార మస్కట్‌ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ హైదరాబాద్ సభ్యులు.. జీహెచ్‌ఎంసీలోని విపత్తుల నిర్వహణ విభాగంతోపాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం తదితర సంస్థలతో సమన్వయం చేసుకోనున్నారు.
ఈ సంస్థలు అందించే డేటా ఆధారంగా నగరంలో ఏయే ప్రాంతాల్లో ఎంతమేర వర్షం కురుస్తోంది అనే విషయాన్ని అంచనా వేస్తారు. అలాగే సిములేషన్ మోడలింగ్ అనే టెక్నాలజీ సహాయంతో లోతట్టు ప్రాంతాలను, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తిస్తారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
ఈ వ్యవస్థ కేవలం ఒక్క హైదరాబాద్ నగరానికి మాత్రమే కాకుండా దేశంలో వరద ముప్పు ఉన్న పలు నగరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఇక ఈ వ్యవస్థతో వరద నీరు ఎటు పారుతోంది, ఏయే ప్రాంతాల్లో నీర ఎక్కువగా నిలిచి ఉంటుంది.? లాంటి అంశాలపై కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




