
08-1-2026, హైదరాబాద్: రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఒకే టికెట్ అనే విధానాన్ని తీసుకురానుంది. ఈ పద్దతి ద్వారా ప్రజలకు తమ జర్నీని మరింత సులభతరం చేయనుంది. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణించాలంటే మెట్రో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే కండక్టర్ల దగ్గర టికెట్ తీసుకోవాలి. ఇక ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణించాలంటే మళ్లీ టికెట్ తీసుకోవాలి. ప్రజలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్నింటికీ ఒకే టికెట్ ప్రవేశపెట్టనుంది. నగరంలో కోటి వరకు జనాభా ఉండగా.. ఎక్కువమంది మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ప్రతీ దగ్గర టికెట్ తీసుకోవాలంటే అసౌక్యంగా ఉంటుంది.
ఈ క్రమంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చడంలో భాగంగా మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ సేవలను అనుసంధానం చేయనుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ విధానం ద్వారా మల్టీ మోడల్ ఇంట్రిగ్రేషన్ వ్యవస్ధ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా కామన్ మొబిలిటీ కార్డును ప్రవేశపెట్టనుంది. ఈ డిజిటల్ కార్డ్ లేదా టికెట్ ద్వారా ప్రజలు మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌లలో ప్రయాణం చేయవచ్చు. విడివిడిగా టికెట్ కొనుగోలు చేయాల్సిన ప్రయాస తప్పనుంది. అలాగే చిల్లర సమస్యకు కూడా చెక్ పడనుంది. పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండే ఈ కార్డుకు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. త్వరలోనే ఈ సేవలను ప్రభుత్వం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మూడు వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసే ప్రాసెస్ చేపడుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 3200 ఆర్టీసీ సిటీ బస్సులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అలాగే 76 ఎంఎంటీఎస్ సర్వీసులు నుడస్తున్నాయి. ఇక మెట్రో రైళ్లల్లో వేలాది మంది తరచూ ప్రయాణం చేస్తున్నారు. ఈ మూడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్‌ను ఏకం చేయడం ద్వారా రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ప్రజలకు ఉపయోగం జరగనుంది. ఇక మెట్రో ఎంఎంటీఎస్ రైళ్లు దిగి బయటకు వచ్చాక వెంటనే అక్కడ ఆర్టీసీ బస్సులు సిద్దంగా ఉండేలా ఏర్పాట్లు చేయనుంది.