Telugu News Telangana Hyderabad Telangana Minister Talasani Srinivas yadav gave clarification on Immersion of Vinayaka idols telugu news
Hyderabad: నిమజ్జనానికి ఆంక్షలు లేవు.. బీజేపీ కావాలని అపోహలు సృష్టిస్తోంది.. మంత్రి తలసాని శ్రీనివాస్ క్లారిటీ
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితితో మొదలైన సంబరాలు ప్రస్తుతం ముగింపు దశకు చేరాయి. ఈ క్రమంలో అధికారులు, ప్రతినిధులు అప్రమత్తమయ్యారు...
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితితో మొదలైన సంబరాలు ప్రస్తుతం ముగింపు దశకు చేరాయి. ఈ క్రమంలో అధికారులు, ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే విషయంలో ఎలాంటి నిబంధనలు లేవని, బీజేపీ నేతలు కావాలనే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పండగలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇవాళ (బుధవారం) ఖైరతాబాద్ మహా గణపతిని మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై హర్షం వ్యక్తం చేశారు. గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు బందోబస్తు నడుమ పక్కాగా జరుగుతున్నాయని, దేశంలో ఎక్కడా జరగని విధంగా హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 1 నుంచి ట్యాంక్‌బండ్ వరకు పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు నిమజ్జనం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
NTR మార్గ్ లో క్రేన్ నెంబర్ 1 నుండి ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. pic.twitter.com/MpLd1V4VET
మరోవైపు.. చవితి నుంచి పూజలందుకుంటున్న ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరేగింపునకు అంతా సిద్ధమైంది. ఊరేగింపు కోసం భారీ ట్రక్ ఏర్పాటు చేశారు. ఇంకొక్క రోజు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉన్నందున భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. ప్రముఖులు, వీఐపీలు ఖైరతాబాద్ వినాయకుడి ముందు క్యూ కట్టారు. విగ్రహాన్ని శోభాయాత్రతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. ఏటా హైదరాబాద్ లో జరిగే గణేశ్ శోభాయాత్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది.