TS Schools Re-Open: తెలంగాణలో స్కూళ్ల రీ-ఓపెన్‌కు తాత్కాలిక బ్రేక్.. హైకోర్టు ఏం చెప్పిందంటే..

|

Aug 31, 2021 | 12:41 PM

మరికొన్ని గంటల్లో తెలంగాణలో స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి. అయితే ఈలోగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిల్‌ను విచారించిన కోర్టు స్కూల్స్..

TS Schools Re-Open: తెలంగాణలో స్కూళ్ల రీ-ఓపెన్‌కు తాత్కాలిక బ్రేక్.. హైకోర్టు ఏం చెప్పిందంటే..
TS High Court
Follow us on

మరికొన్ని గంటల్లో తెలంగాణలో స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి. అయితే ఈలోగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిల్‌ను విచారించిన కోర్టు స్కూల్స్ రీ-ఓపెన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రేపట్నుంచి పాఠశాలలు ప్రారంభించవద్దని ఆదేశించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది.

అయితే అనూహ్యంగా హైకోర్టు ఆదేశాలతో అన్నింటికి బ్రేక్ పడింది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ఏంటని.? ఇలాంటి సమయంలో పాఠశాలలను తెరవడం మంచిది కాదంటూ ప్రైవేట్‌ స్కూల్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వారం పాటు స్కూల్స్ ప్రారంభంపై స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లోని వసతి గృహాలను తెరవద్దని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే స్కూల్స్ రావాలని విద్యార్ధులను బలవంతం చేయకూడదని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్ధులపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ బోధనపై తుది నిర్ణయం పాఠశాలలదేనని హైకోర్టు పేర్కొంది. ప్రైవేటు స్కూల్స్‌కు విద్యార్ధులను పంపడంపై తల్లిదండ్రుల విచక్షణకే వదిలేస్తున్నామంది. ఆఫ్‌లైన్ బోధనపై స్కూల్స్‌కు వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.

కాగా, ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభమైన రాష్ట్రాల్లో కరోనా తాండవిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికాలో వ్యాక్సిన్ వేసుకున్న పిల్లల్లోనూ కరోనా కనిపిస్తోంది. గత పది రోజుల్లో లక్షా 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్ విషయానికి వస్తే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 55 పేజీల నివేదికను పీఎంఓకు సమర్పించింది. ఈ రిపోర్ట్‌లో థర్డ్‌వేవ్ అండ్ చైల్డ్ వర్నరబిలిటీపై పూర్తి వివరాలున్నాయి. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా పాఠశాలలు ప్రారంభించడమేంటి? ఇది సరికాదని చాలామంది అంటున్నారు.

ఇవి చదవండి: