Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..

హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. మెట్రో ఫేజ్ 2కి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో ఫేజ్1 ను స్వాధీనం చేసుకోనుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పుల భారంతో మెట్రో నిర్వహణ నుంచి తప్పుకోవాలని ఎల్‌అండ్ టీ నిర్ణయించింది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..
Hyderabad Metro

Updated on: Feb 23, 2026 | 8:15 PM

హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మెట్రో ప్రభుత్వపరం కానుంది. మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎల్‌అండ్ టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకునేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సోమవారం సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎల్అండ్‌టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కేబినెట్ ఆమోదించింది. దీంతో త్వరలోనే మెట్రో ప్రభుత్వం చేతికి వెళ్లనుంది. ఇక నుంచి ప్రభుత్వమే మెట్రో బాధ్యతలు, నిర్వహణ చూసుకోనుంది.

మెట్రో రెండో దశ విస్తరణ

ఇక మెట్రో విస్తరణకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. సెకండ్ ఫేజ్ చేపట్టేందుకు సిద్దమైంది. 86.1 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే డీపీఆర్ రెడీ అవ్వగా.. దాదాపు రూ.19,579 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. ఇప్పటికే మెట్రో విస్తరణ డీపీఆర్‌ను కేంద్రానికి పంపించింది. దీంతో రెండో దశ విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోనుండటంతో ప్రభుత్వం విస్తరణపై మరింత స్పీడ్ పెంచనుంది. ఆలోపుగా స్వాధీన ప్రక్రియ పూర్తి చేయనుంది. జూన్ నాటికి స్వాధీన ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు రాకుండా పూర్తి చేయాలనే డెడ్ లైన్ పెట్టుకుంది. ఇందుకోసం పలు కన్సల్టెన్సీలకు ఈ బాధ్యతలను అప్పగించింది. లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయా సంస్థలు చూసుకోనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆస్తులు, స్థలాలను అంచనా వేశారు. వాటన్నింటికి ప్రభుత్వానికి బదిలీ చేయనున్నారు.

మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

ఇక మెట్రోను స్వాధీనం చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వం వహించనుండగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ స్వాధీన ప్రక్రియ సజావుగా జరిగేలా చూడనుంది. స్వాధీన ఒప్పందంలో భాగంగా రూ.2 వేల కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం చెల్లించేలా డీల్ కుదిరింది. ఇక రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహన కుదిరింది. ఇక మెట్రో ఆస్తులు, ఐడీబీఐ క్యాపిటల్, రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై డీఎంఆర్‌సీ మదింపు చేసి ప్రాథమిక నివేదికలిచ్చాయి. కాగా నష్టాల క్రమంలో మెట్రో బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ముందుకొచ్చింది.

Follow Us