Telangana: అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. పోలీస్ శాఖలో మరో అధికారిపై బదిలీ వేటు

| Edited By: Janardhan Veluru

Oct 20, 2023 | 6:24 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో పోలీసు అధికారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేస్తున్న రాధా కిషన్ రావుని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Telangana: అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. పోలీస్ శాఖలో మరో అధికారిపై బదిలీ వేటు
Radha Kishan Rao
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో పోలీసు అధికారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేస్తున్న రాధా కిషన్ రావుని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. గత వారం ముగ్గురు నగర పోలీస్ కమిషనర్లు , పది మంది జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు సహా పలువురు ఐఏఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సిఫార్సు మేరకు వారి స్థానంలో కొత్త అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం తెలిసిందే.  ఈ వ్యవహారం సద్దుమణగక ముందే హైదరాబాద్ లో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న రాధా కిషన్ రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సంచలనంగా మారింది..

హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డిసిపిగా గత ఏడు సంవత్సరాలుగా రాధా కిషన్ రావు బాధ్యతలు నిర్వహించారు.  హైదరాబాదులో అత్యంత కీలకమైన సమయాల్లో ఆయన పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిసిపిగా సేవలు అందించారు. మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చెందారు. ఆ తర్వాత ఆయన్ని టాస్క్ ఫోర్స్ ఓఎస్డిగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు రెండు సంవత్సరాలగా ఈ పదవిలో పనిచేస్తున్న రాధా కిషన్ రావు పదవీకాలం గత నెల ముగిసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో రెండు సంవత్సరాల పాటు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాధా కిషన్ రావుపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఈసీ ఆదేశాలిచ్చినట్లు  తెలుస్తోంది. ఎన్నికల ప్రచార పర్వం వేడెక్కిన నేపథ్యంలో పోలీసు శాఖలో మరో కీలక అధికారిని బదిలీ కావడం తీవ్ర చర్చనీయంశమైంది.

షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రక్షాళన..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే.. ప్రభుత్వ యంత్రాంగంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన చేపట్టడం తెలిసిందే. వారి పనితీరు, వారిపై తమకు అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని 13 మంది సీపీలు, కమిషనర్లను ఈసీ అక్టోబర్ 12న బదిలీ చేసింది. అలాగే హైదరాబాద్‌, వరంగల్‌, నిజామబాద్‌ పోలీసు కమిషనర్లు, రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ ఈసీ జారీ చేసిన జాబితాలో ఉన్నారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ను సైతం బదిలీ చేసింది. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీ నర్సింహ, నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌ ఎస్పీ చంద్రమోహన్‌, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.