
మూడు పార్టీల నుంచి స్పెషల్ స్లోగన్స్ వినిపిస్తున్నాయి. రాజులు పాలించే రాజ్యాలు కావు గానీ.. ఒకప్పుడు దేశాన్ని ఏలిన వ్యక్తుల కాలాన్ని, ఆ రాజ్యాన్ని తీసుకొస్తామని చెబుతున్నారు. బీఆర్ఎస్ గెలిస్తే మళ్లీ లౌకిక రాజ్యమే కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నాయకులెవరైనా సరే ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామంటున్నారు. బీజేపీ ఏనాటి నుంచో రామ రాజ్యం అనే చెబుతూ వస్తోంది. ఇంతకీ ఈ రాజ్యాలకు అర్థమేంటి? ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏమవుతుంది, రామరాజ్యం వస్తే ఏం జరుగుతుంది. అసలు కేసీఆర్ చెబుతున్న లౌకిక రాజ్యానికి అర్థమేంటి?
తాను బతికి ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్‌గా ఉంటుందంటూ చెబుతున్నారు సీఎం కేసీఆర్. అంటే, మత కల్లోలాలు, మత ఘర్షణల కారణంగా కర్ఫ్యూలు ఉండబోవని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. తెలంగాణలో ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏనాడు మత ఘర్షణలు గానీ, కర్ఫ్యూలు గానీ లేవంటూ బలంగా చెబుతున్నారు. అందుకే, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా, తబ్ తక్ తెలంగాణ సెక్యులర్ రియాసత్ రహేగా అంటూ కొత్త నినాదం వినిపిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎంఐఎం పార్టీతో బీఆర్ఎస్‌కు ఉన్న స్నేహాన్ని టార్గెట్ చేస్తూ వస్తోంది బీజేపీ. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ప్రచారం చేస్తోంది. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు.. బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీనే అంటూ గట్టిగా చెబుతున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ కల్చర్ గంగా జమునా తెహజీబ్ అంటూ దాదాపుగా ఈమధ్య అన్ని సభల్లోనూ చెబుతూ వస్తున్నారు. ఈ పదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదని చెప్పడం అంటే తమది లౌకిక రాజ్యం అని చెప్పుకోవడమే. అదే సమయంలో కాంగ్రెస్ తీసుకొస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యానికి కొత్త అర్ధం చెబుతూ నిప్పులు చెరుగుతున్నారు గులాబీ బాస్.
ఆకలి, ఎమర్జెన్సీ, నక్సలైట్లు, ఎన్‌కౌంటర్లు.. ఇదే ఇందిరమ్మ రాజ్యం అని కామెంట్ చేస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు ఇవ్వడపోవడం, కరెంట్ లేకపోవడం, మాడిన కడుపులు-ఎండిన డొక్కలు తప్ప ఇందిరమ్మ రాజ్యంలో ఏముందని ఈమధ్య ఎక్కువగా కౌంటర్ ఇస్తున్నారు సీఎం కేసీఆర్.
ఆనాడు 1969 ఉద్యమంలో విద్యార్థులను కాల్చి చంపింది ఎవరో మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. ఆ తర్వాత తెలంగాణ ఇస్తానని మాట తప్పింది కూడా ఇదే ఇందిరమ్మ రాజ్యం అని చెబుతున్నారు.
కాంగ్రెస్ భాషలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఓ నిర్వచనం ఉంది. ప్రజల సంపదను ప్రజలకు పంచడం. అందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేది వారి నినాదం. ప్రజల అవసరాలే అజెండాగా ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామనడమే ఇందిరమ్మ రాజ్యమని చెబుతున్నారు. దేశ సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకు కాదు ప్రజలకు ఉండాలన్నదే తమ విధానమని ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. అందుకే, సీఎం కేసీఆర్ కౌంటర్లకు రివర్స్ కౌంటర్లు వేశారు ప్రియాంక గాంధీ. ఇందిరమ్మ రాజ్యం అంటే కేసీఆర్ చెబుతున్నది కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏళ్లైనా.. దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మను గుర్తుచేస్తుంటారని, అదీ ఇందిరమ్మ రాజ్యమని చెబుతున్నారు ప్రియాంకాగాంధీ. గిరిజనుల కోసం ఆనాడు ఏం చేశామో చెప్పుకొచ్చారు.
గరీబీ హటావో, ప్రైవేట్ బ్యాంకులను ప్రభుత్వపరం చేయడం లాంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ఇందిరా గాంధీ.. దేశ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని గుర్తుచేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రచారం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే అన్ని వర్గాలకు, పేదలకు న్యాయం జరిగిందని, అందుకే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామంటున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. పేదలకు ఇళ్లు, గ్రామాల్లో రోడ్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి.. ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరగలేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కష్టాలు అర్థం చేసుకున్నాం కాబట్టే తెలంగాణలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని, అందులో భాగంగానే 6 గ్యారంటీలు ప్రకటించామంటున్నారు.
ఇక బీజేపీ చెబుతున్న రామ రాజ్యానికి అర్థం ఏంటి? నిజానికి అందరినీ సమానంగా చూడడం, ధర్మ పాలన చేయడం. ఇదే రామరాజ్యానికి అర్థం. అయితే, బీజేపీ మాత్రం రంగురంగుల జెండాలను పక్కన పెట్టి, చేతిలో కాషాయజెండా పడితేనే రామరాజ్యం వస్తుందని చెబుతున్నారు. సో, రామరాజ్యం కోరుకునే వాళ్లంతా బీజేపీలో చేరాలని, బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే ఏమేం ఇస్తామో చెబుతూనే, ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామో కూడా చెబుతున్నారు. దానికే రామ రాజ్యం అనే ట్యాగ్ కూడా అతికిస్తున్నారు. బీజేపీ గెలిస్తే భైంసా పేరును మహిష అని మారుస్తామని, అధికార భాషగా ఉన్న ఉర్దూ భాషను, మదర్సాలను శాశ్వతంగా రద్దు చేస్తామని చెబుతున్నారు. ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లు తీసేసి రామరాజ్య స్థాపన చేస్తామంటున్నారు.
ఏదేమైనా తమ రామ రాజ్యంలో మతవిద్వేషాలు చలారేగకుండా చూస్తామంటున్నారు. దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా హైదరాబాద్‌లోనే మూలాలుంటున్నాయని, రామ రాజ్యంలో అలాంటివి ఉండబోవని హామీ ఇస్తున్నారు. గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు, కేసుల వేధింపులు ఉండవని హామీ ఇస్తున్నారు. అంతేకాదు, రామరాజ్యం రాకపోతే ఏం జరుగుతుందనేది కూడా హెచ్చరిస్తున్నారు. పొరపాటున మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదంటూ బండి సంజయ్ డైరెక్టుగానే చెబుతున్నారు.
ఇక అమిత్‌షా అయితే.. బీజేపీని గెలిపిస్తే ఉచితంగా అయోధ్య యాత్ర చూపిస్తామని హామీ ఇస్తున్నారు. అయోధ్య రామ మందిరం జనవరిలో ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నామని, ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదేనని చెబుతున్నారు. లౌకిక రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, రామ రాజ్యం. ఇలా ఏ పేరు పెట్టినా.. అంతిమంగా అందరికీ సమాన న్యాయం చేయడమే వాటి లక్ష్యం. కాని, తాము తీసుకొస్తామంటున్న రాజ్యాలకు ఎవరికి వారు కొత్త అర్ధాలు చెబుతున్నారు. మరి ప్రజలు ఏ ఆప్షన్ తీసుకుంటారు? ఏ రాజ్యం కోరుకుంటారు? డిసెంబర్ 3న డిసైడ్ అవుతుంది.