Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ.. ఆ ఒక్కటి తేల్చేస్తారేమో..
వడ్ల కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కేంద్రానికి డెడ్‌లైన్ విధించింది. కానీ ఆలోగానే కొనబోమని స్పష్టం చేసింది. మరి ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?
వడ్ల కొనుగోళ్లపై(Paddy Procurement) తెలంగాణ సర్కార్ కేంద్రానికి డెడ్‌లైన్ విధించింది. కానీ ఆలోగానే కొనబోమని స్పష్టం చేసింది. మరి ఇవాళ జరిగే కేబినెట్(Telangana Cabinet) భేటీలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్ వేదికగా భేటీ జరగనుంది. వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. తొమ్మిది రోజుల పాటు ఢిల్లీ పర్యటనను ముగించుకుని నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వడ్ల కొనుగోళ్ళపై సమావేశంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర వైఖరికి నిరసనగా నెక్స్ట్ చేపట్టాల్సిన కార్యాచరణపైనా చర్చించనున్నట్లు సమాచారం. వడ్ల కొనుగోళ్ళపై ఢిల్లీ నిరసన దీక్ష వేదికగా కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ విధించిన తర్వాత జరుగుతున్న కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం వడ్ల సేకరణపై క్లారిటీ ఇచ్చింది. ధాన్యాన్ని కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా కొనబోమని, పారా బాయిల్డ్ రైస్‌ను ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగానే హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ళపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. గతేడాది అక్టోబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసింది.
ఇప్పుడు రాష్ట్ర రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలను తెరవాలనే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్రంతో అమీతుమీ అనే స్థాయిలో కేసీఆర్ స్పష్టమైన వైఖరిని తీసుకున్నందున కేబినెట్‌లో ప్రత్యేకంగా చర్చించి తీసుకోబోయే సంచలన నిర్ణయంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
మధ్యాహ్నంతో ముగియనున్న..
అయితే.. యాసంగి సీజన్‌కు సంబంధించి ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో ఉప్పుడు బియ్యమే వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దఫాలుగా కేంద్రంతో చర్చలు జరిపింది. ఉప్పుడు, ముడి బియ్యం తేడా లేకుండా రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. 24 గంటల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని తేల్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఆ గడువు ఇవాళ మధ్యాహ్నంతో ముగియనుంది.
ఉప్పుడు బియ్యం తీసుకోం..
ఇదిలావుంటే.. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంషు పాండే, హైదరాబాద్‌లో ఎఫ్‌సీఐ ప్రాంతీయ జనరల్ మేనేజర్ దీపక్ మిశ్రా మీడియా సమావేశం నిర్వహించి కొనుగోళ్ల అంశంపై మరోమారు స్పష్టత ఇచ్చారు. ఉప్పుడు బియ్యం తీసుకోబోమని తేల్చి చెప్పారు. ముడి బియ్యానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని గుర్తు చేశారు.
ముడి బియ్యం ఇచ్చే సంగతి..
ఇక.. ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం సమావేశం కానున్న కేబినెట్.. ధాన్యం కొనుగోళ్ల అంశంపై విస్తృతంగా చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అనుసరించాల్సిన వైఖరిపై దృష్టి సారించనున్నారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం అంటున్న పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయమై మంత్రిమండలిలో చర్చిస్తారు. కేంద్రం కోరుతున్నట్లు ముడి బియ్యం ఇచ్చే అవకాశం ఉందా..? లేదా..? ఒకవేళ ఉంటే ఏం చేయొచ్చు.. ఎంత వ్యత్యాసం వస్తుంది.. అన్న అంశాలపై చర్చిస్తారు.
ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..
Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..