
పుష్పా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైయరు.. అక్కడ పుష్ప ఈ డైలాగ్ కొట్టగానే థియేటర్లో ఫ్యాన్స్ క్లాప్స్ కొట్టారు కానీ.. ఇక్కడ పోలీసులు బొక్కలో వేసి కుళ్లబొడిచారు. పుష్ప సినిమాది భారీ బడ్జెట్ కాబట్టి.. పాలవ్యాన్ ట్యాంకర్‌ని సగం సగం చేశాడు. కాని ఇక్కడ లోబడ్జెట్ గంజాయి గాళ్లు.. మినీ వ్యాన్‌ని ఎంచుకున్నారు. కాని వీళ్ల హైటెక్ కాపీయింగ్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే. ఏ నట్టు విప్పినా గంజాయే.. ఏ బోల్టు తీసినా గంజాయే. ఈ వెహికిల్‌లో ఇనుము కన్నా.. గంజాయే ఎక్కువుంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సీట్లు విప్పితే గంజాయి.. రూఫ్‌కి ఉన్న డెకరేషన్ తీస్తే గంజాయి. టైర్ల పైన గంజాయి.. బాడీ కింద గంజాయి. స్పీకర్లు విప్పిచూసినా గాంజానే. మీరు ఎక్కడ చేయి వేసినా.. గంజాయి రాలడం ఖాయం.
అక్కడ ఒక్కడే పుష్ప.. ఆయనది గంధపు చెక్కల స్మగ్లింగ్. ఇక్కడ ఇదిగో.. ఇంతమంది ఉన్నారు. గాంజాని దర్జాగా మోసుకొస్తున్నారు. ఇలాంటి వాహనాలు పదుల సంఖ్యలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తమదైన శైలిలో ఎక్కడికక్కడ స్టోరేజ్‌లు ఏర్పాటు చేసుకుని.. అందులో తమ గంజాయి ప్యాకెట్లు కుక్కడమే పని. అలా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నాయి దొంగ వాహనాలు. ఇక్కడ దొరికిన గంజాయి పుష్పాలు ఏపీకి చెందిన స్మగ్లర్లే. ఏపీ అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ఏరియా నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుతున్నాయి గంజాయి ప్యాకెట్లు. వీరంతా సీలేరు ప్రాంతానికి చెందిన స్మగ్లర్స్. ఈ వాహనంతోపాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన సూత్రధారి పంగిడి పెద్దన్నతోపాటు.. పండన్న, సీతారామ్, సుబ్బన్న, కృష్ణమూర్తి గ్యాంగ్‌గా ఏర్పడి ఈ గంజాయి రవాణా చేస్తున్నారు.
ఈ వాహనం ఏపీ నుంచే వస్తోంది కాని.. గంజాయి మాత్రం ఒడషాది. అల్లూరి జిల్లాకి ఆనుకుని ఉన్న మల్కన్ గిరి నుంచి సీలేరు ద్వారా రవాణా అవుతోంది. ఏపీలో అక్కడి పోలీసులు ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపారు. గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో సీలేరుకు ఆవల ఉన్న మల్కాన్ గిరిలో తమ బంధువుల ద్వారా గంజాయి సాగును మొదలు పెట్టారు. వారు సాగు చేసినదంతా.. సీలేరులో ఓ డంప్ ఏర్పాటు చేసుకుని అక్కడ దాచిపెడతారు. హైదరాబాద్‌లోని ధూల్ పేటలో ఉన్న కొందరితో స్మగ్లర్లకు వ్యాపార లావాదేవీలున్నాయి. ఇక్కడి నుంచి స్మగ్లర్లకు ఆర్డర్ వెళ్లగానే వారు సీలేరు డంప్ దగ్గర ప్యాకింగ్ చేసుకుని ఇలా వాహనాల్లో దాచి.. హైదరాబాద్ పట్టుకొస్తారు. ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ ప్యాక్‌లు తీసి వారి చేతిలో పెడతారు. ఇలా.. హైదరాబాద్ యువతను చెడగొట్టే పనిలో ఉంది ఈ గంజాయి బ్యాచ్.
పుష్ప సినిమా తరహాలో సీక్రెట్ చాంబర్లు, స్టోరేజ్‌లు ఏర్పాటు చేసుకుని ఇక్కడకు వస్తున్నారు స్మగ్లర్లు. నిన్న అశోక్ లేలాండ్ ట్రాలీలో 80 కిలోల గంజాయిని మోసుకొస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికారు గంజాయి పుష్పరాజ్‌లు. తమ ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టపరుచుకోవడం వల్లే ఇది సాధ్యపడిందంటున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..