ఒకప్పుడు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఈ మాటను హైదరాబాద్‌కి అన్వయం చేయాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో విభిన్న జాతుల వారు నివసిస్తున్నారు. వీరు తమ సాంప్రదాయ పండుగలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిని చూసేందుకు హైదరాబాదీలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మన్నటి వరకూ గణేశ్ నవరాత్రుల శోభతోపాటూ దేవీ నవరాత్రులు కూడా ముగిశాయి. ఇక దీపావళి సందర్భంగా సదర్ ఉత్సవాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర వీధుల గుండా దున్న పోతులను ఊరేగించారు. ఈ కార్యక్రమం ప్రతి ఏటా దీపావళి మరుసటి రోజున నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏర్పాటు చేస్తారు.
నిన్న ఖైరతాబాద్ పెద్ద గణేశ్‌ను ఏర్పాటు చేసే ప్రాంతంలో గుజరాత్, హర్యానా నుంచి తెప్పించిన దున్నరాజాలకు ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ విచ్చేశారు. ముందుగా దున్నరాజులకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ దున్నరాజాల నిర్వహణకు ప్రత్యేకమైన శ్రద్ద వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఏటా లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటికి ఆహారంగా డ్రైఫ్రూట్స్, పండ్లు ఆహారంగా పెడడతామన్నారు. వీటికి ప్రత్యేకంగా ఆయిల్ మసాజ్ చేస్తామని చెప్పారు.
వీటిని అప్పుడప్పుడూ పోటీలకు కూడా పంపిస్తామని చెప్పారు. ఇవి దేశంలోనే అత్యంత భారీ కాయం కలిగిన దున్నరాజాలుగా పేర్కొన్నారు. ఒక్కొక్క దున్నపోతు ఎత్తు 6.5అడుగులు, 2000 కేజీలు ఉంటాయి. ఇప్పటి వరకూ 15పైగా ఛాంపియన్ మెడల్స్ గెలుచుకున్నట్లు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే పశుమేళాల్లో కూడా ఇవి పాల్గొంటాయని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..