Riyaz Encounter: రియాజ్ దాడిలో గాయపడ్డ ఆసిఫ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది: డీజీపీ శివధర్‌రెడ్డి

నాంపల్లిలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆసిఫ్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఆసిఫ్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డీజీపీ శివధర్‌రెడ్డి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడారు.. ఆసిఫ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

Riyaz Encounter: రియాజ్ దాడిలో గాయపడ్డ ఆసిఫ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది: డీజీపీ శివధర్‌రెడ్డి
DGP Visits Hospital

Updated on: Oct 21, 2025 | 4:14 PM

నిజామాబాద్‌లో సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే.. కాగా, రియాజ్‌ ను పట్టుకునే క్రమంలో.. మరో వ్యక్తిపై తీవ్రంగా దాడిచేశాడు.. రియాజ్ దాడిలో గాయపడ్డ ఆసిఫ్‌కు ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స జరుగుతోంది. రియాజ్‌ను పట్టుకోవడంలో సాహసంచేసి.. గాయపడటంతో ఆస్పత్రికి వెళ్లి ఆసిఫ్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. నాంపల్లిలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆసిఫ్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఆసిఫ్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డీజీపీ శివధర్‌రెడ్డి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి టీవీ9తో మాట్లాడారు.. ఆసిఫ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సర్జరీ చేసి చేతిని సాధారణ స్థితికి తీసుకొచ్చారన్నారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని డీజీపీ తెలిపారు. ఆసిఫ్ సాహసాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. గ్యాలంట్రీ మెడల్ కోసం సిఫార్సు చేస్తామని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆసీఫ్ ను పరామర్శించిన డీజీపీ..

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్యకు కారణమైన రియాజ్‌ను పట్టుకోబోతూ.. ఆసిఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.. ఆసిఫ్‌ రెండు చేతులను రియాజ్ తీవ్రంగా గాయపర్చాడు. ఆసిఫ్‌కు లోతైన కత్తిగాట్లు కావడంతో ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్‌కి తరలించారు. ఆసిఫ్‌కు చేతి నరాలు కట్‌ అయినట్టు వైద్యులు తెలిపారు. అతనికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

పలు దొంగతనాల కేసుల్లో నిందితుడైన రౌడీ షీటర్ రియాజ్‌ను అక్టోబర్‌ 17న పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. స్టేషన్‌కు తరలిస్తుండగా కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడి మరణించాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర పోలీస్‌ విభాగం పరారీలో ఉన్న నిందితుడి కోసం జల్లెడ పట్టి పట్టుకుంది. ఈ సమయంలో నిందితుడిని పట్టుకోబోతూ.. ఆసిఫ్ గాయపడ్డాడు.. అనంతరం నిందితుడిని.. జీజీహెచ్‌ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో సోమవారం ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్‌ ప్రయత్నించడంతోపాటు.. పోలీసు సిబ్బందిపై దాడి చేసి వారి వద్ద ఆయుధాలు లాక్కునేందుకు యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్‌ మృతి చెందాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..