తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy), రేవంత్ రెడ్డిల (Revant Reddy) మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తీవ్రంగా ప్రతిస్పందించారు. రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వేర్వేరు వ్యక్తులు అన్న ఆయన.. తమ మధ్య కొందరు అగాధం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే రాజగోపాల్ రెడ్డి వెలుగులోకి వచ్చారన్నారు. రాజగోపాల్ రెడ్డిపై చేసిన కామెంట్లపై ఆయన సోదరుడు వెంకట్ రెడ్డికి వివరణ ఇస్తున్నట్లు వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి (Komatireddy Venkatreddy) ఎలాంటి సంబందం లేదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డితో ఏ చర్చకు అయినా సిద్ధంగా ఉన్నానన్న రేవంత్.. మునుగోడు నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా చర్చ జరగలేదని వివరించారు. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వల్లే బ్రాండ్ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి విసిరిన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. ఈరోజు (శుక్రవారం) నేను చండూరుకు వస్తున్నా. చండూరు చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడలేదు. నేను పోరాడితే నాపై 80 కి పైగా కేసులు పెట్టారు. ఆర్థిక ప్రయోజనాల కోసం పార్టీ మారావు. నన్ను తిట్టి, రాజకీయ లబ్ధి పొందాలని చూడవద్దు.
– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కాగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి గతంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. సోనియా గాంధీకి తానెప్పుడూ అన్యాయం చేయలేదని చెప్పారు. రేవంత్ వెనుక చంద్రబాబునాయుడు సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాంట్రాక్టులు తీసుకుని బీజేపీలో జాయిన్ అవుతున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాయం చేస్తానని సవాల్ విసిరారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.