Hyderabad: ‘పుష్ప’ సినిమాని మించిన స్కెచ్‌.. ఎట్టకేలకు వాహనంలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తోన్న ముఠా గుట్టురట్టు

|

Mar 05, 2023 | 12:38 PM

స్మగ్లింగ్‌ గూడ్స్‌ను అక్రమంగా తరలించడంతో ఈ ముఠా 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్‌ను మించిపోయాడు. పోలీసుల కళ్లు గప్పి గుట్టుగా అక్రమంగా గంజాయిని తరలిస్తోన్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చౌటుప్పల్‌ పోలీసులు ఎట్టకేలకు..

Hyderabad: పుష్ప సినిమాని మించిన స్కెచ్‌.. ఎట్టకేలకు వాహనంలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తోన్న ముఠా గుట్టురట్టు
Ganja Smuggling
Follow us on

స్మగ్లింగ్‌ గూడ్స్‌ను అక్రమంగా తరలించడంతో ఈ ముఠా ‘పుష్ప’ సినిమాలో అల్లుఅర్జున్‌ను మించిపోయాడు. పోలీసుల కళ్లు గప్పి గుట్టుగా అక్రమంగా గంజాయిని తరలిస్తోన్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చౌటుప్పల్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సీపీ డీఎస్‌చౌహాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన బానోత్‌ వీరన్న, హైదరాబాద్‌ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్‌ శంకర్‌ నాయక్‌, వరంగల్‌కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు. ఏపీలోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమల్‌గిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్‌ మీదుగా హైదరాబాద్‌, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. అందుకు పోలీసులకు అనుమానంరాకుండా డీసీఎం వాహనం లోపల భాగంలో కొన్ని మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించారు. అనంతరం ఆ వాహనం కింది భాగంలోని ఖాళీ ప్రదేశంలో గంజాయి ప్యాకెట్లను నింపి.. పైన ఇనుప షీట్లు ఉంచి బోల్టులతో బిగించారు. ఆ వాహనంలో ఇటుకలు, కర్రలు వంటి ఏదో ఒక లోడును తీసుకుని నగరానికి వెళ్లేవారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు గంజాయిని గమ్య స్థానానికి చేర్చారు. పోలీసుల కంట పడకుండా వారి వాహనానికి ముందు హ్యుందాయ్‌ క్రెటా కారును పంపి.. ఆనక వెనుక గంజాయితో వెళ్లేవారు.

ఈ క్రమంలో డీసీఎం వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న చౌటుప్పల్‌ పోలీసులు.. శనివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో చౌటుప్పల్‌లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపేశారు. ముందుగా పైలట్‌గా వచ్చిన కారుతోపాటు, డీసీఎంను కూడా పోలీసులు ఆపారు. వాహనాన్ని తనిఖీ చేసే క్రమంలో లోపలి భాగాన్ని కాలితో తన్నిచూడగా శబ్దంలో తేడా వచ్చింది. తర్వాత పోలీసులు చకచకా ఇనుపషీట్లపై బోల్టులు తొలగించడం, లోపలున్న 400 కిలోల గంజాయి స్వీధీనం అంతా జరిగిపోయింది. కారు, డీసీఎంలో వెళ్తున్న మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్‌లో మీడియా సమావేశంలో సీపీ డీఎస్‌చౌహాన్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.