పిస్తా హౌస్.. హైదరాబాద్‌లోని ఫుడ్ లవర్స్‌కు ఈ రెస్టారెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రుచికరమైన వంటకాలు, రెసిపీలతో నగరవాసులను ఆకట్టుకుంటోన్న రెస్టారెంట్‌కు ఆదరణ బాగానే ఉంది. అలాంటి పిస్తా హౌస్ ఇప్పుడు నగర ఆహార ప్రియులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు సిద్ధమైంది. నగరంలోనే మొదటిసారిగా విమానంలో రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఎయిర్ బస్ కంపెనీకి చెందిన ఏ320 రకం పాత విమానాన్ని కేరళలో నిర్వహించిన వేలంలో రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ విమానాన్నే త్వరలో హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్ పేటలో ఫ్లైట్ రెస్టారెంట్ గా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా పరిసరాలను మార్చేస్తోంది. రన్ వే, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లో టికెట్లు తదితర ఏర్పాట్లను చేసింది. విమానంలో 150 సీట్లను ఏర్పాటు చేశారు. ఎంచెక్కా విమానంలో కూర్చొని..శామీర్ పేట చెరువు అందాలను తనివి తీరా చూస్తూ, రుచికరమైన వంటకాలను ఆస్వాదించేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ను తీర్చిదిద్దనున్నారు. ఇందులో మొత్తం150 సీట్లు ఉంటాయి. విమానంలోకి ప్రవేశించేందుకు వీలుగా ఎస్కలేటర్ ను కూడా నిర్మించనున్నారు.
డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ కొత్త రెస్టారెంట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పిస్తా హౌస్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ నగరానికి విమానాన్ని తీసుకురావడంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని అండర్ పాస్ లో ఆ విమానాన్ని తీసుకొస్తుండగా ఇరుక్కుపోయింది. మేదర్‌మెట్ల పోలీసుల సహకారంతో విమానంను బయటికి తీశారు. ఆ తర్వాత కొరిసపడు అండర్ పాస్ నుంచి విమానాన్ని తరలించారు.ఈ ఫ్లైట్ రెస్టరెంట్ హైదరాబాద్‌లో మొట్టమొదటిది అయినప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఇలాంటి రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. పాట్నాలోని హాజీపూర్, హర్యానాలోని గుర్గావ్, గుజరాత్‌లోని వడోదర మొదలైన నగరాల్లో ఇప్పటికే ఇలాంటి రెస్టారెంట్‌లు కొలువుదీరాయి. వడోదరలోని తర్సాలి బైపాస్‌లో గత ఏడాది ఫ్లైట్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ స్టారెంట్‌లో వెయిటర్లు, సర్వర్లు ఎయిర్ హోస్టెస్ తరహాలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఏర్పాటుకానున్న పిస్తా హౌస్ ఫ్లైట్ రెస్టారెంట్‌లో కూడా ఇదే మోడల్‌ను అనుసరిస్తున్నారని తెలుస్తోంది.
#Flight #restaurant in #Hyderabad
Pista House owner who bought an old plane at a Kerala auction. Pista House owner is converting an old plane into a restaurant in Hyderabad pic.twitter.com/g5iOLLMFNu— DONTHU RAMESH (@DonthuRamesh) November 13, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..