Osmania University: రాష్ట్రంలో రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. తొలి దశలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలకు పూనుకుంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా యూనివర్సిటీలకు కూడా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం లోపు విద్యార్థులందరూ హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. మళ్లీ అధికారిక ప్రకటన వచ్చేంత వరకు హాస్టళ్లు, మెస్ బంద్ ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరోనా పేరుతో ఓయూలో హాస్టళ్లను మూసివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. యూనివర్సిటీ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌సీసీ గేట్ వద్ద రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు.
Also read:
Photo Gallery: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోవడమంటే ఇదే.. ఈ దొంగ చూడండి ఎలా బుక్కయ్యాడో..
Sonu Sood: బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు.. నేరుగా కలిసిన రియల్ హీరో… ( వీడియో )