Hyderabad Heavy Rains : రాజధాని హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి నాన్ స్టాప్ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు భాగ్యనగరాన్ని నిలువెత్తున తడిపేస్తున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా జంటనగరాల్లో రోజూ ఏదో సమయాన వర్షాలు కుండపోతగా కురుస్తున్న సంగతి తెలిసిందే. రుతుపవనాలకు తోడు, బంగాళాఖాతంలో ఏర్పడుతోన్న అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇక, రాత్రి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ లోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది.
దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ దాదాపు జలయమయ్యాయి. కాలనీలు నీట మునిగాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి భారీగా వాన నీరు వచ్చి చేరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, గచ్చీబౌలి, మణికొండ, మెహదీపట్నం, నాంపల్లి, కోటి, వనస్థలిపురం, మేడ్చెల్ తదితర ప్రదేశాలతోపాటు, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోనూ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
ఇక, హైదరాబాద్‌లో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 8 గంటల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలిచ్చారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి సంగారెడ్డి, యాదాద్రి, మెదక్ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దాదాపు జంట నగరాల్లో అన్ని చోట్లా భారీ వర్షాలు కురుస్తుండగా, పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదవుతోంది.
నాగోల్, బండ్లగూడ, ప్రశాంత్‌నగర్, హస్తినాపురం, సరూర్‌నగర్, హయత్‌నగర్, ముసారాంబాగ్ బ్రిడ్జి, పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ కాలనీల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాల్లో నడుంలోతు నీళ్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షానికి నగరంలోని అనేక ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.
Read also : Murder Attempt : తూర్పుగోదావరి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడులు, ముగ్గురిపై హత్యాయత్నం