Hyderabad: రోడ్లపై చెత్తవేస్తే జరిమానాలు విధించే GHMCకే ఫైన్.. అసలేమైందంటే?

హైదరాబాద్‌లో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ జీహెచ్‌ఎంసీకి పెద్ద షాక్‌ ఇచ్చింది. వ్యర్థాల యాజమాన్యంలో పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో నగర బల్దియాపై లక్ష రూపాయల ఫైన్ విధించింది. ప్రజలకు చెత్త వేయడంపై జరిమానాలు విధించే అదే బల్దియాపై..

Hyderabad: రోడ్లపై చెత్తవేస్తే జరిమానాలు విధించే GHMCకే ఫైన్.. అసలేమైందంటే?
NGT fines GHMC for violating garbage dumping

Edited By: Srilakshmi C

Updated on: Nov 13, 2025 | 8:36 PM

హైదరాబాద్‌, నవంబర్ 13: హైదరాబాద్‌లో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ జీహెచ్‌ఎంసీకి పెద్ద షాక్‌ ఇచ్చింది. వ్యర్థాల యాజమాన్యంలో పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో నగర బల్దియాపై లక్ష రూపాయల ఫైన్ విధించింది. ప్రజలకు చెత్త వేయడంపై జరిమానాలు విధించే అదే బల్దియాపై ఇప్పుడు ఎన్జీటీ శిక్షా దండనకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కేంద్ర బిందువు అయింది. హైదరాబాద్ నగరంలో ప్రతి రోజూ ఉత్పత్తయ్యే వేల టన్నుల చెత్తను శాస్త్రీయంగా వేరు చేయకుండానే, నేరుగా అక్కడికి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. చెత్త కారణంగా గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయని, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వారు ఎన్జీటీకి కంప్లైంట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఎన్జీటీ తాజాగా విచారణ జరిపి జీహెచ్‌ఎంసీపై జరిమానా విధించడమే కాకుండా, జవహర్‌నగర్ యార్డుకు చెత్త తరలింపును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అయితే నగరంలో చెత్త సేకరణ పూర్తిగా ఆగిపోతే ప్రజా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని జీహెచ్‌ఎంసీ విన్నవించుకుంది. దాంతో ట్రైబ్యునల్ కఠినమైన షరతులతో తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. ఇకపై చెత్తను యార్డులో యథేచ్ఛగా వేయకూడదని… ఇప్పటికే పేరుకుపోయిన చెత్తపై క్యాపింగ్‌ ప్రక్రియ (చెత్తను కప్పి, శాస్త్రీయంగా మూసివేయడం) తక్షణమే చేపట్టాలని ఆదేశించింది. అలాగే వ్యర్థాలను వేర్వేరు విభాగాలుగా సేకరించి, ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కూడా సూచించింది.

ఈ తీర్పుతో బల్దియా అధికారులు తాత్కాలిక ఊరట పొందినా, సమస్య మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారమవలేదు. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే వేల టన్నుల వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం నగర పాలక సంస్థకు సవాలుగా మారింది. భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చకపోతే, పర్యావరణ సమస్యలు తీవ్రమవుతాయనే హెచ్చరికగా ఎన్జీటీ తీర్పు నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.