Hyderabad: నగరవాసులకు కొత్త సంవత్సర కానుక.. నేడు అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్‌.. ఇక ఆ రూట్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్

కొత్త సంవత్సరం కానుక‌గా హైద‌రాబాద్ వాసుల‌కు మ‌రో నూత‌న ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రానుంది. కొత్తగూడ ఫ్లై ఓవ‌ర్‌ను మంత్రి కేటీఆర్ ఆదివారం (జనవరి1) ప్రారంభించ‌నున్నారు. రూ. 263 కోట్ల వ్యయంతో సుమారు 3 కిలోమీట‌ర్ల మేర ఈ ఫ్లై ఓవ‌ర్‌ను నిర్మించారు.

Hyderabad: నగరవాసులకు కొత్త సంవత్సర కానుక.. నేడు అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్‌.. ఇక ఆ రూట్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్
Kothaguda Flyover

Updated on: Jan 01, 2023 | 8:22 AM

కొత్త సంవత్సరం కానుక‌గా హైద‌రాబాద్ వాసుల‌కు మ‌రో నూత‌న ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రానుంది. కొత్తగూడ ఫ్లై ఓవ‌ర్‌ను మంత్రి కేటీఆర్ ఆదివారం (జనవరి1) ప్రారంభించ‌నున్నారు. రూ. 263 కోట్ల వ్యయంతో సుమారు 3 కిలోమీట‌ర్ల మేర ఈ ఫ్లై ఓవ‌ర్‌ను నిర్మించారు. నగర వాసులకు సిగ్నల్‌ రహిత రవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఎస్ఆర్డీపీ కింద జీహెచ్‌ఎంసీ ఈ నిర్మాణం చేపట్టింది. ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావడంతో కొండాపూర్, గ‌చ్చిబౌలి వాసుల‌కు ట్రాఫిక్ సమస్యలు తీర‌నున్నాయి. ఈ ఫ్లై ఓవర్ ద్వారా బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్‌ల మధ్య సులభంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఈ ఫ్లై ఓవర్ ఎస్‌ఎల్‌ఎన్‌ టర్మినల్ నుంచి బొటానికల్‌ జంక్షన్‌ వరకు ఐదు లేన్లతో, బొటానికల్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు ఆరు లేన్లతో, కొత్తగూడ జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ వరకు మూడు లేన్లతో నిర్మించారు. అలాగే కొత్తగూడ నుంచి హైటెక్ సిటీ వెళ్లేందుకు 338 మీటర్ల పొడవుతో హైటెక్ సిటీ వైపు మూడు లేన్ల డౌన్ ర్యాంప్, మసీదు బండ నుంచి బొటానికల్ జంక్షన్ వైపు వెళ్లేందుకు రెండు లేన్లతో బొటానికల్ అప్ ర్యాంప్, అటునుంచి హఫీజ్‌పేట వెళ్లేందుకు 470 మీటర్ల పొడవు కలిగిన అండర్ పాస్‌ను కూడా నిర్మించారు.

ఐటీ ఉద్యో్గులకు తీరనున్న కష్టాలు..

కాగా బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్లకు ఇరువైపులా భారీ కమర్షియల్‌ భవనాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో అనేక సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీలు, కంపెనీలు ఉన్నాయి. ఈ జంక్షన్లలో రద్దీ సమయాల్లో భారీ ట్రాఫిక్‌ జాం అవుతోంది. ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి మియాపూర్‌ వరకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, హైటెక్‌సిటీ ప్రాంతం మధ్య ప్రధాన కనెక్టివిటీ రహదారి ఏర్పడుతుంది. ఈ ఫ్లై ఓవర్‌ రాకతో బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌, కొత్తగూడ జంక్షన్లలో వంద శాతం ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కొండాపూర్‌ జంక్షన్‌లో 65 శాతం మేర ట్రాఫిక్‌కు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. నూతన సంవత్సర కానుకగా ఆదివారం ఉదయం కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..