Telangana: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి కోటి ఆశలతో ఆమె దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. ఇష్టమైన భాగస్వామితో నిండు నూరేళ్లు ఆనందంగా బ్రతకాలనుకుంది. కానీ తాను ఒకటి తలిస్తే.. విధి మరోలా తీసుకెళ్లింది. ఆ నిండైన జంటను చూసి కళ్లు కుట్టాయో, ఏమో.. ఆమెను అర్థాంతరంగా మృత్యువు తీసుకెళ్లిపోయింది. మెట్టినింట అడుగుపెట్టానన్న ఆనందాన్ని ఆస్వాదించేలోపే.. శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే తొలుత గుండెపోటుకు గురైన నవ వధువు.. ఆపై బ్రెయిన్‌స్ట్రోక్‌తో తుదిశ్వాస విడిచింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మెదక్(Medak) పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన రాఘవేంద్ర… పార్వతీపురానికి చెందిన ఉష(23) రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. పెద్దల్ని ఒప్పించి ఈ నెల 11న హైదరాబాద్‌లో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. ప్రేమించిన వాడినే భర్తగా పొందడంతో ఆమె మురిసిపోయింది. ఎంతో సంతోషంతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అత్తారింటి కుటుంబ సభ్యులు కూడా ఆమెను బాగా చూసుకుంటూ ఉండటంతో మురిసిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం ఆమెకు తలనొప్పి రావడంతో స్థానికంగా ఓ డాక్టర్‌కు చూపించారు. అతడు పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉందని చెప్పడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం మూర్ఛ రాగా, ఒక్కసారి తీవ్రమైన గుండెపోటు వచ్చి బ్రెయిన్‌స్ట్రోక్‌తో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి