
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. నగరంలో ఇప్పటికే అనేక భారీ ఫ్లైఓవర్లు ఉండగా.. మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. మల్టీ లెవల్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. ఐటీ కారిడార్‌లో అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలి జంక్షన్‌లొ నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్‌ను 2028 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ జంక్షన్‌లో ఇప్పటికే రూ.500 కోట్లతో మరమ్మత్తు పనులు జీహెచ్‌ఎంసీ చేపట్టగా.. దీని ద్వారా ఐటీ కూడళ్లను సిగ్నల్ ఫ్రీ ఇంటర్ చేంజ్‌గా మార్చనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు.
ఐఎస్‌బీ నుంచి డీఎల్‌ఎల్ వరకు లెవల్ 1 బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ నిర్మిస్తారు. ఇక డీఎల్‌ఎఫ్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు, ఐఎస్‌బీ రోడ్ నుంచి ఇందిరా నగర్ వరకు లెవల్ 2 సెమీ సర్క్యూలర్ ఫ్లైఓవర్లు ఉంటాయి. ఇక వీటి కింద ఇందిరా నగర్, గచ్చిబౌలి స్టేడియంను కలిపే అండర్ పాస్ ఉంటుంది. దీనికి 18 నుంచి 21 మీటర్ల క్యారేజ్‌వేలో తవ్వకం అవసరముంటుంది. ప్రస్తుతం వీటి పనులు మొదలయ్యాయి. డీఎల్‌ఎఫ్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వైపు ఫ్లైఓవర్ ల్యాండింగ్ కోసం లింగంపల్లి రోడ్డులో ఇప్పటికే మూడు నుంచి నాలుగు స్తంభాలు వేశారు. లింగంపల్లి వైపు ఉన్న ఐఐఐటీ హైదరాబాద్ జంక్షన్ ప్రస్తుతం ప్రతి వైపు 3 నుంచి 3.58 లైన్లను కలిగి ఉంది.
ఒకేసారి ఆరు లైన్లకకు క్యారేజ్ వే తవ్వాలంటే గణనీయమైన భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇది ట్రాఫిక్‌కు పెద్ద ఇబ్బందికరంగా మారనుంది. దీంతో రెండు వైపులా చెట్లు ఉండటంతో పర్యావరణశాఖ నుంచి అనుమతి వచ్చాక చెట్లను తరలించనున్నారు. అలాగే విద్యుత్ తీగలను కూడా తొలగించి భూగర్భంలోకి మార్చనున్నారు. ఇక ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. లింగంపల్లి నుంచి వాహనాలను మసీదు బండా గ్రామం మీదుగా బొటానికల్ గార్డెట్ సమీపంలో విలీనం చేసి గచ్చిబౌలి రోడ్డులో కలపనున్నారు. ఇక ఐఐఐటీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ తీసివేయనున్నారు. వాహనదారులు యూటర్న్ తీసుకుని ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ల రాకతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ భారీగా తగ్గనుందని అధికారులు చెబుతున్నారు.