40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంటర్ పరీక్ష.. విద్యార్థిగా మారిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ!
Dev Ji, former Maoist leader: కాలం ఎంత పెద్ద మార్పునైనా తీసుకురాగలదనే విషయాన్ని మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మరోసారి నిరూపించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మధ్యలో ఆగిపోయిన తన చదువును కొనసాగిస్తూ, జగిత్యాల జిల్లా కోరుట్లలోని మాస్టర్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు లాంగ్వేజ్ పరీక్ష రాశారు.

ఒకప్పుడు అజ్ఞాత జీవితం… పోలీసుల నిఘా… అడవుల్లో విప్లవ రాజకీయాలు… ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా పరీక్ష హాల్‌లో కూర్చొని సమాధానాలు రాసిన విద్యార్థి. కాలం ఎంత పెద్ద మార్పునైనా తీసుకురాగలదనే విషయాన్ని మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మరోసారి నిరూపించారు. దాదాపు 40 ఏళ్ల క్రితం మధ్యలోనే ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగించాలని నిర్ణయించుకున్న దేవ్ జీ… జగిత్యాల జిల్లా కోరుట్లలోని మాస్టర్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు లాంగ్వేజ్ పరీక్ష రాశారు. ఆయన పరీక్ష రాయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఉద్యమ జీవితానికి ముందు ఆగిపోయిన చదువు…
విద్యార్థి దశలోనే రాడికల్ భావజాలం వైపు ఆకర్షితుడైన దేవ్ జీ… ఆ సమయంలో రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం అజ్ఞాత జీవితం ఎంచుకుని మావోయిస్టు ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారు. అయితే ఉద్యమ జీవితం కారణంగా ఆయన విద్య మధ్యలోనే నిలిచిపోయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో తెలుగు పరీక్ష మిగిలిపోయినట్టుగా తెలుస్తోంది.
కాలం గడిచింది… ఉద్యమాలు మారాయి… జీవితం మరో మలుపు తిరిగింది. కానీ, చదువు పూర్తి చేయాలనే కోరిక మాత్రం దేవ్ జీ మనసులో అలాగే మిగిలిపోయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పట్టుదలతో మళ్లీ పుస్తకాల వైపు
ఇటీవల దేవ్ జీ తిరిగి చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఆ తర్వాత న్యాయవాద విద్య ఎల్ఎల్‌బీ చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగలని నిర్ణయించుకున్నారు. ఈ పరీక్ష కోసం ఆయన కొద్ది రోజులుగా స్థానిక లెక్చరర్ వద్ద ప్రత్యేకంగా ట్యూషన్ తీసుకున్నారని తెలిసింది. వయసు పెరిగినా… దాదాపు నాలుగు దశాబ్దాల విరామం వచ్చినా… పరీక్ష రాయాలనే సంకల్పంతో ప్రతిరోజూ చదువుకు సమయం కేటాయించినట్లు చెబుతున్నారు.
దేవ్ జీ పరీక్ష రాయడానికి కేంద్రానికి రావడంతో అక్కడ ఒక్కసారిగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఒకప్పుడు వార్తల్లో నిలిచిన మాజీ మావోయిస్టు నాయకుడు… ఇప్పుడు సాధారణ విద్యార్థిలా పరీక్ష రాయడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు, స్థానికులు ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపగా… మరికొందరు “చదువుకు వయసు అడ్డంకి కాదనే విషయాన్ని దేవ్ జీ నిరూపించారు” అని అభిప్రాయపడ్డారు.
దేవ్ జీ కథ ఇప్పుడు కేవలం ఒక పరీక్ష కథ మాత్రమే కాదు… మధ్యలో చదువు ఆగిపోయిన వేలాది మందికి ఇది ఒక ప్రేరణగా మారుతోంది. పరిస్థితులు ఎలా ఉన్నా… వయసు ఎంత పెరిగినా… నేర్చుకోవాలనే తపన ఉంటే జీవితంలో ఎప్పుడైనా కొత్త ఆరంభం చేయొచ్చనే సందేశాన్ని ఆయన నిర్ణయం బలంగా చెబుతోంది. ఒకప్పుడు తుపాకీ పట్టిన చేతులు… ఇప్పుడు పెన్ పట్టి పరీక్ష రాయడం… అజ్ఞాత జీవితం నుంచి విద్యా ప్రయాణం వైపు అడుగులు వేయడం… దేవ్ జీ జీవితంలో ఇది నిజంగానే కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు.
