Maganti Ravindra funeral : మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్ర అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాగంటి రవీంద్ర అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జేసీ దివాకర్‌రెడ్డి, నటుడు అశోక్‌కుమార్ తదితరులు హాజరై.. మాగంటి బాబు కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మాగంటి బాబుకి ప్రగాఢ సానుభూతి తెలియ చేసిన నారా లోకేష్.. మాగంటి కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఇలా ఉండగా, మాగంటి బాబు రెండవ కుమారుడైన మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఇటీవల కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయనను నగరంలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొన్ని రోజుల ట్రీట్మెంట్ తరువాత ఆయన ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేశారు. అయితే, ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన రాత్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. రక్తపు వాంతులు కావడంతో ఆయన హోటల్ లోని బాత్ రూంలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మాగంటి రవీంద్ర మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని మృతికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవలే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కూడా మరణించిన విషయం తెలిసిందే. మాగంటి బాబు ఇద్దరు కుమారులు నెలల వ్యవధిలో అకాల మరణం చెందటం కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.