
తాగుబోతులకు ఒక సమయం, సందర్భం ఎందుకున్నట్లు ఇక్కడ జరిగిన ఓ సంఘటన నిరూపిస్తోంది. తాగి మత్తులో తూలేవాడికి రాత్రి పగలూ అంటే తేడా అనేది ఉండదు. జీవితం మీద, భవిష్యత్తు మీద అసలే భయం ఉండదు. వాళ్లను నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడుతాయేమోనన్న కనీస ధ్యాస ఉండదు. పైగా తాగితే తాగారు. కానీ, పవిత్ర స్థలాలుగా భావించే కొన్ని ప్రాంతాలలో మద్యం సేవించరాదన్న జ్ఞానం కూడా లేదని తెలిసి కూడా ఊరుకుంటే కుదరదు. ఇలాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవహరించక తప్పదు.
హైదరాబాద్ నగరం పాతబస్తీలో హుసేని ఆలం కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతే దర్వాజా జమాల్ బీతకియా కబ్రస్థాన్(దూద్ బౌలీ) వద్ద పగటి పూటే మద్యం సేవిస్తున్నారు. ఈ మందుబాబులకు పోలీసుల భయం లేదు. స్థానికుల భయం అసలే లేదు. కబ్రస్థాన్‌ను మద్యం సేవించే స్థలంగా మార్చేశారు. కబ్రస్థాన్ అంటే సమాధుల స్థలం. ముఖ్యంగా ముస్లింల కోసం ఏర్పాటు చేసే స్మశానవాటిక. అలాంటి చోటును కూడా వదలకుండా ఆ ప్రదేశాన్ని మద్యం తాగే స్థలంగా మార్చేస్తున్నారు ఈ ప్రబుద్ధులు. బహిరంగ ప్రదేశంలో ఎవరేం అనుకుంటే మాకేంటిలే అన్నట్లు ఫుల్లుగా తాగుతూ జల్సా చేస్తున్న ఈ మందుబాబులని దూరం నుంచి ఎవరో వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలో అప్పటికే వాళ్లు మత్తులో ఉన్నట్లు తూలడం స్పష్టంగా కనిపిస్తోంది. మనిషి చివరి గమ్యస్థానంగా భావించే స్మశాన వాటిక లాంటి ప్రదేశంలో ఇలాంటి పాడు పనికి పాల్పడుతున్నవారిపై స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే వీరిని చూసి మరికొందరు ఇలాంటి చర్యలకే అలవాటు పడతారని బాహాటంగా విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, కబ్రస్థాన్ లాంటి ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాతబస్తీ నివాసితులు కోరుతున్నారు. మరోమారు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.