
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కేవలం పేదల ఇళ్లను ఎందుకు కూల్చుతుందో సమాధానం చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.. పెద్దల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం కేటీఆర్ హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రాపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడంతోపాటు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. యూపీలో బుల్డోజర్‌ను అడ్డుకుంటానన్న రాహుల్.. తెలంగాణలో పేదల ఇళ్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరన్నారు. భట్టి విక్రమార్క చెప్పిన బిల్డర్లపై ఇప్పటి వరకు చర్యలు లేవంటూ కేటీఆర్ విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి పేదలకు న్యాయమే చేశాం.. తాము ఎవరికీ అన్యాయం చేయలేదంటూ కేటీఆర్ పేర్కొన్నారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని హామీఇచ్చారు.
బాధితులకు సమయం ఇస్తే కోర్టుకు వెళతారన్న హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కేటీఆర్. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో బాధితులకు లేదా ? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ భూమి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదన్నారు కేటీఆర్. రేవంత్ ఒత్తిడి వల్లే అధికారులు స్వయంగా ఆయన భూమికి ఫెన్సింగ్ వేసి పెట్టారన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక స్వయంగా పేదల ఇళ్లను కూల్చడంపై దృష్టి పెట్టారని విమర్శించారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లను కూల్చడమేనా అని ప్రశ్నించారు.
హైడ్రా కారణంగా ఇళ్లు కోల్పోయిన పలువురు బాధితులతో మాట్లాడారు కేటీఆర్. తాము అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..