Medico Preethi case: మెడికో ప్రీతి ఆత్మహత్య ఎపిసోడ్‌ పూర్తి వివరాలు.. 5 రోజుల్లో ఎప్పుడేం జరిగిందంటే..

|

Feb 27, 2023 | 8:05 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేసిన మెడికో ప్రీతి ఆత్మహత్య చివరికి విషాదాంతమైంది. ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది. ఐదురోజుల నరకయాతన తర్వాత తుది శ్వాస విడిచింది..

Medico Preethi case: మెడికో ప్రీతి ఆత్మహత్య ఎపిసోడ్‌ పూర్తి వివరాలు.. 5 రోజుల్లో ఎప్పుడేం జరిగిందంటే..
Medico Preethi Case
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేసిన మెడికో ప్రీతి ఆత్మహత్య చివరికి విషాదాంతమైంది. ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది. ఐదురోజుల నరకయాతన తర్వాత తుది శ్వాస విడిచింది. ఆదివారం రాత్రి 9గంటల 10 నిమిషాలకు ప్రీతి మరణించినట్లు ప్రకటించింది నిమ్స్‌. ఇంతకీ, ప్రీతి ఆత్మహత్య వెనుక అసలేం జరిగింది?. ఎప్పుడు, ఎలా ఆత్మహత్యాయత్నం చేసింది?. ఫిబ్రవరి ఐదు నుంచి 26వరకు ఈ ఐదు రోజుల్లో ఎప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..

ఫిబ్రవరి 22, ఉదయం 6 గంటలు

తెల్లవారుతూనే వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ)లో అలజడి రేగింది. పీజీ స్టూడెంట్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త క్యాంపస్‌లో కలకలం సృష్టించింది. అధిక మొత్తంలో మత్తు మందు (ట్రెమడాల్‌ హైడ్రోక్లోరైడ్ 50MG ఇంజక్షన్‌) తీసుకుని అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని హుటాహుటినా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం హైదరాబాద్‌ నిమ్స్‌కి షిఫ్ట్‌ అధికారులు చేశారు.

ఫిబ్రవరి 23

ప్రీతి హెల్త్‌ కండీషన్‌పై ప్రకటన రిలీజ్‌ చేసింది నిమ్స్‌. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వెల్లడించింది. మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్‌తోపాటు బ్రెయిన్‌లో సమస్య ఉందంటూ ప్రీతి కండీషన్‌పై క్లారిటీ ఇచ్చారు వైద్యులు. వెంటిలేటర్‌ అండ్‌ ఎక్మో సపోర్ట్‌పై ట్రీట్‌మెంట్‌ జరుగుతున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 23నే ప్రీతి తండ్రి కీలక ఆరోపణలు చేశారు. ప్రీతి బాడీలో అస్సలు చలనం లేదని, శరీరం కలర్‌ మారిపోయిందంటూ ఆరోపించారు. నిమ్స్‌లో జరుగుతోన్న ట్రీట్‌మెంట్‌పై ప్రీతి తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో అసలేం జరుగుతుందోనన్న కలకలం రేగింది. అదే రోజు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు. నిమ్స్‌ వైద్యులతో మాట్లాడి సిట్యువేషన్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 24

ప్రీతి ఎపిసోడ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రీతి ఆరోగ్యం మరింత క్షీణించినట్టు నిమ్స్‌ ప్రకటించింది. కీలక అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయినట్టు వెల్లడించింది. మరోవైపు ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్‌ను వరంగల్‌ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు.

ఫిబ్రవరి 25

ప్రీతి ఆరోగ్యంపై అనేక వదంతులు చెలరేగాయ్‌. బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు లీకులు బయటికి వచ్చాయ్‌. అయితే, ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందన్న సమాచారం అందడంతో నిమ్స్‌కెళ్లి ప్రీతి హెల్త్‌ కండీషన్‌పై ఆరా తీశారు మంత్రి హరీష్‌రావు.

ఫిబ్రవరి 26

ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు భారీ హైడ్రామా నడిచింది. నిమ్స్‌ దగ్గర ఒకవైపు పోలీస్‌ బలగాలను మోహరిస్తూ మరోవైపు ప్రీతి హెల్త్‌ కండీషన్‌పై లీకులు వదిలారు. ఈలోపు నిమ్స్‌ నుంచి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కి సమాచారం వెళ్లింది. అంతలోనే మంత్రి ఎర్రబెల్లి కూడా కీలక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే మిగులుందంటూ ప్రకటించారు. చివరికి రాత్రి 9గంటల 10నిమిషాలకు ప్రీతి చనిపోయినట్లు ప్రకటన విడుదల చేసింది నిమ్స్‌. బ్రెయిన్‌ డెడ్‌ కారణంగా మరణించినట్లు వెల్లడించారు.

ప్రీతి మరణించిందన్న ప్రకటన తర్వాత నిమ్స్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ్‌. ఒకవైపు ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు… మరోవైపు గిరిజన సంఘాలు… ఇంకోవైపు బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగడంతో నిమ్స్‌ పరిసరాలు అట్టుడికిపోయాయ్‌. దాంతో ఆదివారం రాత్రంతా భారీ హైడ్రామా కొనసాగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.