హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఫిబ్రవరి 1-3 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా.. ఇందులో వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్‌లో వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్‌తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు.
ఆధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్ సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, ఆగ్రి పరిశ్రమల ప్రముఖుల నుంచి ఇన్నోవేటివ్ స్టార్టప్‌లు వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు.