హైదరాబాద్, సెప్టెంబర్ 18 హైదరాబాద్ మహా నగరంలో వినాయక చతుర్థి సందర్భంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమంలో భాగ్యనగర వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు గణపతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే నగర పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సిటీ పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విఘ్నేశ్వరుడి పండుగ వేళ నగర ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఉత్సవాలు జరిగేలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. నగరంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రసిద్ధి.
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది భక్తులతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రలు వస్తుంటారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఖైరతాబాద్ పరిసరాల్లో రానున్న 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు నేటి నుంచి అంటే సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
కాగా, వాహనదారులు ఈ 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించాలని పోలీసులు కోరారు. అలాగే ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..