Jubilee Hills By Election: ప్రజల మొగ్గు ఎవరివైపు..? ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక

జూబ్లీ హిల్స్‌లో పొలిటికల్ థ్రిల్లర్‌ కొనసాగుతోంది. మూడు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్‌ను తొలి దెబ్బ కొట్టి సత్తా చాటాలని కారు పార్టీ ప్లాన్ చేస్తుంటే.. ఇక్కడ కూడా తమదే పైచేయి అని నిరూపించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక విక్టరీ కోసం తమదైన పంథాను అనుసరించాలని కమలనాథులు భావిస్తున్నారు.

Jubilee Hills By Election: ప్రజల మొగ్గు ఎవరివైపు..? ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక
Jubilee Hills By Election

Updated on: Oct 20, 2025 | 8:56 AM

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును గెలుచుకోవడంతో పాటు మళ్లీ తెలంగాణలో బలం పుంజుకున్నామని నిరూపించాలని ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. జూబ్లీ హిల్స్‌ నుంచే మళ్లీ తమ జైత్రయాత్ర మొదలుపెట్టాలని భావిస్తోంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని.. కాంగ్రెస్‌ను తొలి దెబ్బతీయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతోంది.

జూబ్లీ హిల్స్‌లో గెలుపు బాధ్యతలు తీసుకున్న మంత్రులు..

కాంగ్రెస్ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు గెలుపు బాధ్యతను తీసుకుని నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ సహకరించిందని ఆరోపించిన సీఎం రేవంత్.. అదే తరహా రాజకీయాలు జూబ్లీహిల్స్‌లోనూ చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీ..

అభ్యర్థి ఎంపిక విషయంలో కాస్త ఆలస్యం జరిగినా.. జూబ్లీ హిల్స్ గెలుపును దక్కించుకునే విషయంలో మాత్రం పొరపాటు జరగొద్దని భావిస్తోంది బీజేపీ. తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ బలమైన ప్రభావం చూపించాలని ప్లాన్ చేసుకుంటోంది. బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన లంకల దీపక్ రెడ్డి.. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

జూబ్లీ హిల్స్ ప్రజల మొగ్గు ఎవరివైపు అనే ఉత్కంఠ..

పార్టీల ప్రచార హోరు.. అభ్యర్థుల జోరు ఎలా ఉన్నా.. జూబ్లీ హిల్స్ ప్రజల మొగ్గు ఎవరి వైపు అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ప్రజలు అధికార పార్టీకే జై కొడతారా లేక విపక్ష పార్టీల వైపు నిలుస్తారా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇక పండగ తరువాత జూబ్లీ హిల్స్‌లో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరేలా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..