సమస్యల వలయంలో సాఫ్ట్‌వేర్స్‌..! ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మందికి ఆ డిసీజ్..

ఇక ప్రభుత్వాలు కూడా ప్రజలలో ఈ సమస్యలపై అవగాహన కల్పించాలి. అవసరమైన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అవసరమైతే వైద్య సలహా అందించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తంగా చెప్పాలంటే, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగులు శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు అవసరం.

సమస్యల వలయంలో సాఫ్ట్‌వేర్స్‌..! ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మందికి ఆ డిసీజ్..
Hyderabad It Employees

Edited By: Jyothi Gadda

Updated on: Aug 02, 2025 | 1:53 PM

మీకేంటి సాఫ్ట్‌వేర్ జాబ్.. బిందాస్ లైఫ్ అని ఇంకెప్పుడు అనకండి. బయట నుంచి చూస్తే వారు ఎంతో హుందాగా, సుఖంగా కనిపించవచ్చు. వారానికి ఐదు రోజులే పని, మంచి ప్యాకేజ్, కూల్ లైఫ్ స్టైల్… ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం. కానీ దీని వెనుక అసలు విషయం చాలామందికి తెలియదు. ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నారు. డెడ్‌లైన్లు, ప్రాజెక్ట్ ఒత్తిడులు, పోష్ లైఫ్ స్టైల్ వంటి అంశాలు వారి ఆరోగ్యాన్ని తీవ్రమైన సమస్యలవైపు నెట్టేస్తున్నాయి.

తాజా లెక్కల ప్రకారం, హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నట్టు తేలింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా ఇటీవల లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో… హైదరాబాద్‌లో చేసిన పరిశోధనలో 84 శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి (MAFLD) ఉందని.. 71 శాతం ఒబెసిటీతో బాధపడుతున్నారని వెల్లడించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.

2025లో ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమైన రీసెర్చ్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 345 మంది ఐటీ ఉద్యోగుల్లో 118 మందికి (34.2%) మెటబాలిక్ సిండ్రోమ్, 290 మందికి (84.06%) కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు నిర్ధారణ అయ్యాయి. ఇది ఐటీ రంగంలో ఆరోగ్య సమస్యలు ఎంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయో సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తో కలిసి “ఇండియన్ మెటబాలిక్ అండ్ లివర్ డిసీజ్ ఫేజ్-1” కింద ప్రాంతీయ ఆరోగ్యపరమైన ప్రమాదాలను అధ్యయనం చేస్తోంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నివారణ, నియంత్రణ కోసం కొన్ని సూచనలు చేసింది.

ఈ సమస్యల నుంచి సర్దుకోవాలి అంటే.. ఐటీ ఉద్యోగులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, అధిక ఆయిల్ ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి రోజు వ్యాయామం చేయాలి.బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. తినే ఫుడ్ విషయంలో జాగర్తలు పాటించాలి.

ఇక ప్రభుత్వాలు కూడా ప్రజలలో ఈ సమస్యలపై అవగాహన కల్పించాలి. అవసరమైన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అవసరమైతే వైద్య సలహా అందించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తంగా చెప్పాలంటే, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగులు శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు అవసరం. ఉద్యోగ భద్రత, సొంత ఇల్లు, కార్లను కన్నా ముందు.. ఆరోగ్యమే అసలైన సంపద అని గుర్తించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.