హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గురువారం నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ కార్యాలయంలో నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ట్రాఫిక్ విభాగానికి చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లతో సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ విభాగంతో కలసి పని చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చెందిన డీఆర్‌ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు లేని సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులతో కలసి హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందం కలిసి పని చేసేలా ఏర్పాట్లు చేయాలని వారు సమావేశంలో చర్చించారు.
రెండు విభాగాలు కలసి పని చేయాలని, ముఖ్యమైన సమయాల్లో హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వర్షం పడినప్పుడు వరద నీరు (వాటర్ లాగింగ్) చేరే ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి నీటిని తొలగించేందుకు డీఆర్‌ఎఫ్ బృందాలతో ట్రాఫిక్ పోలీసులు కలిసి పని చేస్తాయని అధికారులు తెలిపారు. వెంటనే నీరు తొలిగించేలా హార్సు పవర్ ఎక్కువ ఉన్న మోటర్ల వినియోగంచనున్నట్లు వెల్లడించారు. ఆ నీటిని ఎక్కడకు తోడాలనేదానిపై చర్చ జరిగినట్లు చెప్పారు. శాశ్వత పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు, వరద కాలువలు, పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, కొత్త లైన్లను వేసి వరదకు శాశ్వత పరిష్కారం చూపడం వంటివి చేస్తామని వారు తెలిపారు.