Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. జీహెచ్‌ఎంసీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ నరకానికి చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు భారీ ప్రణాళికతో రంగంలోకి దిగారు. రోడ్లపై పడే అక్రమ పార్కింగ్‌లపై ఉక్కుపాదం మోపడంతో పాటు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించేందుకు కసరత్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో కీలక చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేసే వాహనాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు అత్యంత రద్దీ ప్రాంతాలను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు మల్టీలెవల్ పార్కింగ్‌లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, నిరంతర ఫుట్‌పాత్‌లు, సర్వీస్ రోడ్ల అభివృద్ధి వంటి పలు కీలక ప్రాజెక్టులను ఒకేసారి అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హుమ్టా వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, హుమ్టా, జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని నగర ట్రాఫిక్‌ను మెరుగుపరిచే కార్యాచరణపై చర్చించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా రహదారులపై వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టారు. చార్మినార్ బస్టాండ్‌లో నిర్మిస్తున్న మల్టీలెవల్ పార్కింగ్ తరహాలో నెక్లెస్ రోడ్‌తో పాటు ఇతర వాణిజ్య ప్రాంతాల్లో కూడా పీపీపీ విధానంలో కొత్త పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటి ద్వారా రోడ్లపై నిలిపే వాహనాల సంఖ్య తగ్గి ట్రాఫిక్ సాఫీగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆరాంఘర్ జంక్షన్‌లో స్కైవాక్, బండ్లగూడ ఆరె మైసమ్మ ఆలయం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అత్తాపూర్ – ఆరాంఘర్ మార్గాన్ని విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. మెహిదీపట్నం నుంచి కూకట్‌పల్లి వరకు, నానల్‌నగర్ నుంచి టోలిచౌకి వరకు నిరంతర ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసేందుకు ఆక్రమణలను తొలగించనున్నారు.
ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్‌ల వద్ద కొత్త డివైడర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉప్పల్ మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా స్కైవాక్ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ప్రధాన రహదారులన్నింటిలో నియంత్రిత ఆన్-స్ట్రీట్ పార్కింగ్ విధానాన్ని అమలు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు నగరంలోని కీలక జంక్షన్ల వద్ద ఉన్న 11 కేవీ, 33 కేవీ విద్యుత్ లైన్లను దశలవారీగా భూగర్భ కేబుళ్లుగా మార్చే ప్రతిపాదనకు కూడా సమావేశంలో ప్రాధాన్యం లభించింది. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ నియంత్రణ, పాదచారుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను సమన్వయంతో అమలు చేస్తే హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత దశలవారీగా అమలు ప్రారంభం కానుంది.
