Medak: ఫోన్‌పే బాక్స్ రిపేర్ చేస్తానంటూ మోసం.. క్షణాల్లో వేలు మాయం
మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఫోన్‌పే సౌండ్ బాక్స్ రిపేర్ చేస్తానంటూ ఓ కిరాణా వ్యాపారిని నమ్మించిన సైబర్ నేరగాడు.. అతడి మొబైల్ ఫోన్ తీసుకుని ఫోన్‌పే ద్వారా రూ.60 వేలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. బాక్స్‌లో సమస్య లేదని, మొబైల్ యాప్‌లో సౌండ్ సెట్టింగ్ మార్చాలని చెప్పి ఫోన్ తీసుకున్న నిందితుడు.. యజమాని దృష్టి మళ్లించి డబ్బును తన ఖాతాలోకి బదిలీ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తూ.. కస్టమర్ కేర్ ప్రతినిధులమని, సర్వీస్ ఏజెంట్లమని చెప్పి వారి మొబైల్ ఫోన్లను తీసుకుని డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది.
ఫోన్‌పే బాక్స్ బాగు చేస్తానంటూ..
వెల్దుర్తికి చెందిన కైలాస్ సంతోష్ స్థానికంగా ‘శ్రీ వెంకటేశ్వర కిరాణం’ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన షాపులో ఫోన్‌పే సౌండ్ బాక్స్ ఉంది. అయితే కొంతకాలంగా బాక్స్ నుంచి సౌండ్ తక్కువగా వస్తోంది. ఈ విషయం గుర్తించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి.. తాను ఫోన్‌పే సౌండ్ బాక్స్‌లను మరమ్మతు చేసే అధికారిక ప్రతినిధినని సంతోష్‌ను నమ్మించాడు. బాక్స్‌లో ఎలాంటి సమస్య లేదని, మొబైల్ యాప్‌లోనే సౌండ్ పెంచే ఆప్షన్ ఉందని చెప్పాడు. తానే సెట్ చేస్తానంటూ సంతోష్‌ను నమ్మించాడు.
మొబైల్ చేతికి రాగానే..
అతడి మాటలు నమ్మిన సంతోష్ తన మొబైల్ ఫోన్‌ను అపరిచిత వ్యక్తికి ఇచ్చాడు. ఫోన్ చేతికి వచ్చిన వెంటనే సదరు వ్యక్తి యజమాని దృష్టిని మళ్లించి.. ఫోన్‌పే యాప్ ద్వారా సుమారు రూ.60 వేల నగదును తన ఖాతాలోకి బదిలీ చేసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. అనంతరం ఫోన్‌పే బాక్స్‌ను సెట్ చేశానని చెప్పి మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన ఫోన్‌ను పరిశీలించిన సంతోష్.. బ్యాంక్ ఖాతా నుంచి రూ.60 వేలు డెబిట్ అయినట్లు వచ్చిన మెసేజ్ చూసి షాక్‌కు గురయ్యాడు. తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోసానికి పాల్పడిన వ్యక్తి కోసం వివరాలు సేకరిస్తున్నారు.
వ్యాపారులకు పోలీసుల కీలక సూచనలు
ఇలాంటి మోసాల బారిన పడకుండా డిజిటల్ పేమెంట్ సౌండ్ బాక్స్‌లు ఉపయోగించే వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్ ఫోన్ ఇవ్వొద్దు.
కస్టమర్ కేర్ లేదా సర్వీస్ ప్రతినిధులమని చెప్పినా ముందుగా వారి వివరాలను ధృవీకరించుకోవాలి.
ఫోన్‌పే బిజినెస్ లేదా సంబంధిత అధికారిక యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి.
సౌండ్ బాక్స్ వాల్యూమ్ పెంచడం, తగ్గించడం వంటి సెట్టింగులను వీలైనంత వరకు మీరే చేసుకోవాలి.
OTP, UPI PIN, పాస్‌వర్డ్ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
అనుమానాస్పద లావాదేవీ జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
ఒక్కసారి మొబైల్ ఫోన్ అపరిచితుడి చేతికి వెళ్తే.. మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ‘సర్వీస్ చేస్తాం’ అని వచ్చే ప్రతి వ్యక్తిని నమ్మకుండా ముందుగా ధృవీకరించుకోవడం అత్యంత ముఖ్యం.
