భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి హెలికాప్టర్‌లో ముచ్చింతల్ శ్రీరామనగరానికి చేరుకుంటారు. ఆ తర్వాత శ్రీరామానుజాచార్యుల స్వర్ణవిగ్రహ ఆవిష్కరణ, సమతామూర్తి భారీవిగ్రహాన్ని సందర్శిస్తారు. సహస్రాబ్ది సమారోహంలో భాగంగా శ్రీరామనగరంలో రాష్ట్రపతి ప్రత్యేకపూజలతోపాటు 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు చినజీయర్ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి బస చేసిన తర్వాత…రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
ప్రెసిడెంట్ టూర్ సందర్భంగా ముచ్చింతల్ ఆశ్రమంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఆశ్రమంలో ఉండే 2 గంటలు విఐపీలు, వివిఐపీలు, ఐడీకార్డులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీసులు భద్రతను సమీక్షిస్తున్నారు.