సైదాబాద్ చిట్టి తల్లి కిడ్నాప్ నుంచి రాజు ఆత్మహత్య వరకు…వారం రోజులు ఏంజరిగింది?

|

Sep 16, 2021 | 2:42 PM

సైదాబాద్‌ సింగరేణి కాలనీ బాలిక హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెప్టెంబర్ 9న ఆరేళ్ల పాపపై నిందితుడు రాజు అత్యాచారానికి పాల్పడి..

సైదాబాద్ చిట్టి తల్లి కిడ్నాప్ నుంచి రాజు ఆత్మహత్య వరకు...వారం రోజులు ఏంజరిగింది?
Saidabad Rapist Raju
Follow us on

సైదాబాద్‌ సింగరేణి కాలనీ బాలిక హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెప్టెంబర్ 9న ఆరేళ్ల పాపపై కామాంధుడు రాజు అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత దారుణ హత్యకు పాల్పడ్డాడు. పాప కనిపించకుండాపోయినప్పటి నుంచి స్థానిక అటో డ్రైవర్ పల్లంకొండ రాజు(30) పరారీలో ఉన్నాడు.
నిందితుడి స్వస్థలం నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం. హైదరాబాద్‌కు వచ్చి ఆటోను నడుపుతున్నాడు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ జులాయిగా పేరుపొందిన రాజు.. తన భార్యను కొట్టి ఇంట్లోంచి వెళ్ల గొట్టాడని స్థానికులు చెబుతున్నారు.

ఏం జరిగిందంటే…?
సెప్టెంబర్ 9వ తేదీన రాజు మాదన్నపేటలో భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. ఉదయం 9 గంటలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తన గదికి తిరిగొచ్చాడు. సాయంత్రం 4.30-5 గంటల మధ్యలో చిన్నారికి మాయ మాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకొచ్చాడు. రూమ్ లోనే చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారి అరుస్తుంటే గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గదికి తాళం వేసి బయటకు వచ్చిన రాజు..తాగిన మైకంలో అదే ప్రాంతంలో తచ్చాడాడు. సాయంత్రం 7గంటలకు స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్ద పానీ పూరి తిన్నాడు. అప్పటికే సింగరేణి కాలనీ వాసులందరూ పాప కోసం వెతుకుతున్నారు. రాత్రి 9 గంటలకు చిన్నారి నాయనమ్మను చూసిన రాజు.. ‘పాప కనిపించిందా?’’ అని ప్రశ్నించాడు. తాగిన మత్తులో రోడ్డుపై వెళ్తున్న అతను అలా ప్రశ్నించడంతో పాప నాయనమ్మకు అనుమానం కలిగింది. ఇంటికి వచ్చి ఇంట్లోవాళ్లకు ఈ విషయం చెప్పింది. పాప చెవికి ఉన్న బంగారు దుద్దుల కోసం తమ కుమార్తెను తీసుకోపోయి ఉండొచ్చని అనుమానం కలిగింది. కుటుంబసభ్యులు ఆ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో.. విషయం తెలుసుకున్న రాజు మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

రాత్రి 9 గంటలకు స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు రాజు ఉంటున్న గది వద్దకు వెళ్లారు. గదికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికులు గది తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వద్దని వారించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి 12 గంటల దాకా వెతికి ఆ తర్వాత గది తాళం పగలగొట్టి ఇంట్లో వెతగ్గా పాప మృతదేహం కనిపించింది. రాత్రి 9 గంటల సమయంలోనే తాళం పగలగొట్టి ఉంటే పాప ప్రాణాలతో దక్కి ఉండేదనే చర్చ జరుగుతోంది.

రాజు కోసం తూర్పు మండలం డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాల గాలింపు చేపట్టాయి. సెప్టెంబర్ 15న.. రాజు ఆచూకీ తెలిపితే రూ.10లక్షలు బహుమతి ఇస్తామని సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. సెప్టెంబర్ 16న 8.45 స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్ పై రాజు మృత దేహం గుర్తించారు. రైలుకింద పడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

నిందితుడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హత్యాచార ఘటన జరిగి సరిగ్గా వారం రోజులు గడిచాక మానవ మృగం రాజు రైలు పట్టాలపై శవమై తేలడం చర్చనీయాంశంగా మారింది. రాజును పోలీసులు ఎక్కడో పట్టుకుని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Also Read..

సైదాబాద్‌ రాజు ఆత్మహత్య వ్యవహారంపై స్పందించిన వైఎస్‌ షర్మిల.. ఏమన్నారంటే..

Chiranjeevi: ఆ కిరాతకుడు తనకు తానే శిక్ష విధించుకోవడం ఊరటనిచ్చిందన్న మెగాస్టార్ చిరంజీవి..