Teegala Krishna Reddy: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక కట్టడి చర్యలు చేపడుతోంది. ఆఖరి అస్త్రం అయిన లాక్‌డౌన్ కూడా విధించింది. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే కట్టు తప్పుతున్నారు. రూల్స్ సామాన్యులకే గానీ మాకు కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ డబుల్ మాస్కు ధరించాలని అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వాలు కోడై కూస్తున్న కొంతమందికి అసలు చెవిన పట్టడం లేదు. అయితే దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాస్క్ లేకుండా కారులో కనిపించారు. గమనించిన పోలీసులు ఫైన్ విధించారు. కారులో వెళ్లినా కూడా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తీగల కృష్ణారెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించి మాస్క్ లేకుండా తిరగడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరూర్‌నగర్ పోలీసులు కర్మన్‌ఘాట్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో వాహనాల్లో వెళ్తూ మాస్కు ధరించని వారికి పోలీసులు జరిమానా విధించారు. ఇదే సమయంలో మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి తన కారులో వెళ్తుండగా.. పోలీసులు ఆపారు. మాస్కు ధరించని తీగల కృష్ణారెడ్డికి సబ్ ఇన్‌స్పెక్టర్ ముఖేష్ రూ. 1000 జరిమానా విధించారు. దీంతో తీగల కృష్ణారెడ్డి, ముఖేష్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో వెళ్లినా కూడా మాస్కు ధరించాల్సిందేనని తీగలకు ఎస్ఐ తేల్చిచెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని.. సరూర్‌నగర్ పోలీసులు వెల్లడించారు.
Also Read: