Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది మరణించగా.. మరికొంత మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 21 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఆరుగురు ఉన్నారు. అపార్ట్ మెంట్ సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన కెమికల్స్ డ్రమ్స్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బిల్డింగ్ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బిల్డింగ్ యజమాని రమేష్ జైష్వాల్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై పోలీసులు 304, 285, 286, ఐపీసీ 9 బీ(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బజార్ ఘాట్ అగ్నిప్రమాద స్థలంలో ఎంఐఎం, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్.. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కాగా.. అక్కడే ఉన్న ఎంఐఎం నేతలు ఫిరోజ్‌ఖాన్ ఆరోపణలను ఖండించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలంలోనే కాంగ్రెస్, ఎంఐఎం నేతలు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
కాగా.. అగ్ని ప్రమాదంపై పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్.. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని.. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసకుంటామన్నారు. ప్రభుత్వం తరుఫున మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాద స్థలిని పరిశీలించిన కిషన్ రెడ్డి.. పలు వివరాలను అడిగితెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి సాయం అందిస్తామని ప్రకటించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. నగరంలో ఉన్న కెమికల్ గోడౌన్లను శివారు ప్రాంతాలకు తరలించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నాంపల్లి ప్రమాదంపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో 9 మంది మృతిచెందడం విషాదకరమన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..