Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2కు లైన్ క్లియర్ అవుతోందా..! ఆ గంటన్నరపాటు ఏం జరిగింది..

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన చర్చల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న తొలి దశ మెట్రోకు సంబంధించిన IRFC రుణం, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2కు లైన్ క్లియర్ అవుతోందా..! ఆ గంటన్నరపాటు ఏం జరిగింది..
Revanth Reddy, Kishan Reddy

Updated on: Jun 23, 2026 | 7:54 AM

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2 సమస్య పరిష్కారం కాబోతోందా?. IRFC రుణం చిక్కులు వీడబోతున్నాయా?. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇదే నిజమని తెలుస్తోంది. సీఎం రేవంత్ వరుసభేటీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం చూస్తే.. మెట్రోపై ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2 పర్మిషన్‌కు ఢిల్లీలో సానుకూల వాతావరణం కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే తొలిదశ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు మధ్యలో ఆగిన IRFC రుణం క్లియర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర రైల్వేమంత్రితో అపాయింట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డికి లేఖ రాయడం, అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేయడం, స్వయంగా కిషన్ రెడ్డి కూడా పాల్గొనడంతో.. నిన్న మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న నాయకులు రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు కలిసి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవంలో భాగంగా.. గాంధీ సరోవర్‌కు అనుమతులు రావడంతో కేంద్ర రక్షణమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కిషన్ రెడ్డితో కలిసి వెళ్లి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. దాదాపు గంటన్నరపాటు ఈ భేటీ జరిగింది. తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులతో పాటు ప్రధానంగా ఐఆర్‌ఎఫ్‌సీ లోన్‌ అంశంపై ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. IRFC నుంచి రావాల్సిన 13వేల 600 కోట్ల విడుదలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ తరువాత బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి .. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నామన్నారు సీఎం రేవంత్..

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరో కీలక భేటీలో పాల్గొననున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు విస్తరణ, కేంద్ర ప్రభుత్వ వాటా, నిధుల మంజూరుపై ప్రధానంగా చర్చిస్తారు. ఖట్టర్‌తో భేటీలోనూ కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలుస్తోంది.

రాష్ట్రంలో నువ్వా-నేనా అన్నట్లు సవాళ్లు విసురుకున్న సీఎం రేవంత్, కిషన్ రెడ్డి.. ఢిల్లీలో మాత్రం రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కలిసి ముందడుగు వేయడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం చెప్పినట్లు కేంద్రం నుంచి పాజిటివ్ నిర్ణయం వస్తుందా?. లేక మెట్రోకు మళ్లీ బ్రేకులు పడతాయా అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us