AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే..!

సాయంత్రం ఆరు దాటిందంటే చాలు.. ఐటీ కారిడార్‌లోని మెట్రో స్టేషన్లలో కాళ్లు పెట్టడానికి కూడా చోటుండదు. ఈ రద్దీ తలనొప్పులకు చెక్ పెట్టేందుకు 60 కొత్త కోచ్‌లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ ప్రయాణికులకు ఒక బ్యాడ్ న్యూస్. సీన్‌లోకి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎస్‌బీఐ క్యాప్స్ ఎంటర్ అవ్వడంతో కథ అడ్డం తిరిగింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే..!
Hyderabad Metro New Coaches Delayed By 2 Years
Krishna S
|

Updated on: Jun 29, 2026 | 10:28 AM

Share

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రతిరోజూ సాయంత్రం మెట్రో ఎక్కాలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షం పడినా, రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయినా మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని తట్టుకోవడానికి సాధ్యమైనంత త్వరగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో కోసం కొత్త కోచ్‌ల రాక మరింత ఆలస్యం కానున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. సాంకేతిక, ఆర్థిక కారణాల వల్ల మరో రెండేళ్ల వరకు కొత్త కోచ్‌లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మెట్రోరైలు మొదటిదశ ప్రాజెక్ట్‌ను పూర్తిగా ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోగానే, రద్దీని తట్టుకోవడానికి వీలుగా 60 కొత్త కోచ్‌ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ సంస్థతో ప్రాథమిక సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం మెట్రోరైలు ప్రాజెక్ట్‌ మొత్తం విలువను రీ వాల్యుయేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ స్వాధీన ప్రక్రియలో పెద్ద ప్రతిష్టంభన నెలకొంది.

ఎస్‌బీఐ క్యాప్స్‌ రంగంలోకి..

ఈ విలువ నిర్ధారణ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం ఎస్‌బీఐ క్యాప్స్‌‌ను రంగంలోకి దించింది. అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి కింది దశలు దాటాల్సి ఉంటుంది.

విలువ నిర్ధారణ: ఎస్‌బీఐ క్యాప్స్‌ మెట్రో విలువను లెక్కించడానికి కనీసం మరో 2 నెలల సమయం పడుతుంది.

తక్కువ వడ్డీకి రుణం: మెట్రోకు ప్రస్తుతం ఉన్న భారీ అప్పులను ప్రభుత్వంపైకి బదిలీ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను ఎస్‌బీఐ క్యాప్స్‌ ఎంపిక చేయాలి.

ఆర్డర్ ఆలస్యం: ఈ లోన్ మంజూరు ప్రక్రియ ముగిసి, స్వాధీన ప్రక్రియ పూర్తి కావడానికే ఈ ఏడాది అయిపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చేతికి ప్రాజెక్ట్ వచ్చేంతవరకు కొత్త కోచ్‌లకు ఆర్డర్ ఇచ్చే అవకాశం లేదు.

మరో రెండేళ్ల వరకు కొత్త కోచ్‌లు కష్టమే..

ఒకవేళ ఈ ఏడాది చివర్లో అన్నీ సరుద్దుకుని ఆర్డర్ ఇచ్చినా.. ఆర్డర్ అందినప్పటి నుండి కోచ్‌లను తయారు చేసి సరఫరా చేయడానికి కనీసం 15 నెలల సమయం పడుతుందని తయారీ సంస్థ స్పష్టం చేసింది. ఈ లెక్కన చూసుకుంటే, కొత్త కోచ్‌లు హైదరాబాద్ ట్రాక్‌పైకి రావడానికి కనీసం 2028 వరకు సమయం పట్టవచ్చు. అంటే అప్పటివరకు ప్రయాణికులు ప్రస్తుతమున్న మూడు కోచ్‌ల మెట్రోలతోనే సర్దుకుపోవాల్సి ఉంటుంది.

మెట్రోకు దూరమవుతున్న ప్రయాణికులు

రద్దీ సమయాల్లో కనీసం కాళ్లు పెట్టడానికి కూడా చోటు లేకపోవడం, స్టేషన్లలో కిలోమీటర్ల మేర లైన్లు ఉండటంతో విసిగిపోతున్న కొందరు ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు నెమ్మదిగా మెట్రోకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. రద్దీని తగ్గించి, ప్రయాణికులను నిలుపుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us