హైదారాబాదీలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మంగళవారం నగరంలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలతో పాటు, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. మంగళవారం అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం రాత్రి నుంచి నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కురుస్తున్నవర్షాల నేపథ్యంలోనే మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక భారీ వర్షం కారణంగా న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ కింద భారీగా నీరు చేరింది. ఇక ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కీలోమీటర్ల మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మంగళవారం (ఈరోజు) ఉదయం నుంచి నగరంలోని అమీర్‌పేట్, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, సుచిత్ర, కొంపల్లి, నిజాం పేట, కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, గచ్చిబౌలితో పాటు మెహదీపట్నంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్సాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసులకు బయలుదేరిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇదిలా ఉంటే మంగళవారం తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే 11 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తతో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వెస్తునన్నందున మూసి పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా సమస్య ఉంటే జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 040- 21111111 నెంబర్ లేదా డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. అలాగే ఈవీడీఎమ్ కంట్రోల్ రూమ్ 9000113667 నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..