Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Liberation Day: అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడపుట్టించారు.. తూటాల వర్షం కురిసినా వెనక్కి తగ్గలేదు.. గడీల పాలనకు చరమగీతం

Hyderabad Liberation Day: అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడపుట్టించారు. దోపిడికి కాలం చెల్లిపోతుందనే భయంతో...అరాచకాలు సృష్టించిన గడీల పాలనకు..

Hyderabad Liberation Day: అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడపుట్టించారు.. తూటాల వర్షం కురిసినా వెనక్కి తగ్గలేదు.. గడీల పాలనకు చరమగీతం
Hyderabad Liberation Day
Follow us
Subhash Goud

|

Updated on: Sep 17, 2022 | 5:54 AM

Hyderabad Liberation Day: అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడపుట్టించారు. దోపిడికి కాలం చెల్లిపోతుందనే భయంతో…అరాచకాలు సృష్టించిన గడీల పాలనకు చరమగీతం పాడారు. బారీ ఫిరంగులు మోగినా, తుపాకీ తూటాల వర్షం కురిసినా ఎత్తిన జెండా దించలేదు. రవ్వంత స్ఫూర్తిని కూడా తగ్గనివ్వలేదు. బలిదానాలు చేసి మరీ సాయుధపోరాటానికి ఊపిరిలూదారు. రజాకార్ల ఆకృత్యాలను మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం.

ఖాసీం రజ్వీ కన్నెర్రజేస్తుండగా, చిత్రహింసలతోటి తెల్లారుతుండగా తెలంగాణ ప్రజలు బిక్కబిక్కుమంటూ బతుకును వెళ్లదీసిన నాటి తెలంగాణ పరిస్థితిని చూస్తే తెలంగాణ ప్రాంతం పోరాటాలతోనే కాలం వెళ్లదీస్తుందని స్పష్టమవుతుంది. భూమికోసం, భుక్తికోసం, తెలంగాణ ప్రాంతం విముక్తికోసం ఎంతోమంది రజాకార్లతో పోరాడి అమరులయ్యారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినప్పటికి పట్టువదలకుండా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకే సెప్టెంబర్ 17, 1948న పోలీస్ చర్యలో భాగంగా నిజాం భారత యూనియన్ కు లొంగిపోయారు.

ప్రజల డిమాండ్ ఏమిటి?

ఇవి కూడా చదవండి

దీంతో హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైంది. అందుకు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రభుత్వమే జరిపించాలని తెలంగాణ ప్రాంత ప్రజల ప్రధాన డిమాండ్ గా ఉంది. రజాకార్లు తెలంగాణ ప్రాంతంలోని హిందువులపై సాగించిన మారణ, దారుణకాండకు తల్లడిల్లిన గ్రామీణ ప్రజలు సంఘంగా ఏర్పడ్డారు. తెలంగాణ ప్రాంతంలో సంఘం అనేది మెట్టమొదట ఏర్పడడానికి కారణం ఇదేనని చెప్పక తప్పదు. సంఘంగా ఏర్పడిన ప్రజలు వెట్టి, అక్రమ, నిర్భంధ వసూళ్లు వంటి విధానాలు ఇంకెంతో కాలం సాగవని ప్రకటించారు. అంతేకాదు పోరాటమంటే గ్రామాధికారులకు, భూస్వాములకు, దేశ్ ముఖ్ లకు, జాగీర్దారులకు వ్యతిరేక పోరాటం కావడంతో రజాకార్లు పోలీసులతో కల్సి ఈ పోరాటాలను అణచివేయాలని చూశారు.

దీంతో ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాలకు అండగా నిలబడ్డారు. రజాకార్లు ఇష్టానుసారంగా దోపిడీలు, మానభంగాలు, గృహదహనాలకు పాల్పడ్డారు. ప్రజలు ప్రతిఘటిస్తే పోలీసులు, రజాకార్లు వచ్చేవారు. దీంతో నిజాం సైన్యం, రజకార్ల దళాలు చేసేటువంటి దురాగతాలను ఎదిరించడం కోసం కమ్యూనిస్టుపార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది.

రజాకార్లతో వేధింపులు..

1947సంవత్సరం, ఆగస్టు 15న బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ప్రకటిస్తూనే సంస్థానాలను భారత ప్రభుత్వంలో కలపడం ఇష్టం లేకపోతే స్వయం ప్రతిపత్తితో ఉండాలనే అవకాశం ఇవ్వడంతో హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ లో కలవదని స్వతంత్ర్యంగా ఉంటుందని నిజాం ప్రకటించుకున్నారు. ఫలితంగానే హైదరాబాద్‌లో ఉండబడే తెలంగాణ జిల్లాల ప్రజలు అనేక వేధింపులను ఎదుర్కొన్నారు. రజాకార్లతో రణం చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతో మంది సాయుధ పోరాటమార్గాన్ని ఎంచుకొని పోరుసాగించారు. ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కుర్రారం రామిరెడ్డి, రేణిగుంట రామిరెడ్డితో పాటు ఎంతో మంది సాయుధ పోరాటంలో అసువులుబాసారు.

118 మంది బలి

ఈ సందర్భంగానే వరంగల్ జిల్లా బైరాన్ పల్లి, కూటిగల్, మద్దూరు, దూల్ మిట్ట, లింగాపూర్ వంటి గ్రామాల్లో రజాకార్లు ప్రజలను అనేక వేధింపులకు గురిచేశారు. ప్రజలు కూడా గ్రామరక్షణ దళాలుగా ఏర్పడి రజాకార్లతో పోరాటం జరిపి అనేక మంది గ్రామస్థులు చనిపోయారు. 1948 సంవత్సరం, మే నెలలోనే రజాకార్లు వారి సైన్యంతో బైరాన్ పల్లి గ్రామంపై దాడి చేసి 118మందిని చంపివేశారు. అయినప్పటికిని రోజురోజు బాధలకన్న ఒక్కరోజు బాధ మంచిదని నిర్ణయించుకున్నటువంటి గ్రామాల ప్రజలు గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడి నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. వరంగల్, నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో అదే సాయుధ పోరాటంలో అసువులు బాసినటువంటి తెలంగాణ అమరుల పేరిట స్తూపాలు దర్శనమిస్తుంటాయి. కాగా బైరాన్ పల్లిలో చనిపోయినటువంటి 118మంది అమరుల పేర్లతో కూడిన స్తూపాన్ని గ్రామస్తులు నిర్మించుకోవడంతో పాటు అమరుల పేర్లను స్తూపంపై చెక్కి తెలంగాణ అమరత్వాన్ని చరిత్రలో నిలబెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి