
భాగ్యనగరం హైదరాబాద్ అభివృద్ధి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. హైదరాబాదీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానమైంది. ఈ క్రమంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నగరవ్యాప్తంగా పలు ఫ్లై ఓవర్‌ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు ఫ్లై ఓవర్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండే కొత్తగూడ, నాగోల్, శిల్పా లేఅవుట్, కైతలారూర్, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్స్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు భారీ ఊరట లభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఫ్లై ఓవర్ నగర వాసులకు అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్‌లో నిర్మిస్తున్న ఆర్.హెచ్.ఎస్ ఫ్లై ఓవర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 12 అడుగుల వెడల్పుతో 700 మీటర్ల పొడవున్న ఫ్లై ఓవర్‌ను మూడు లేన్‌లతో నిర్మించారు.
ఈనెల చివరి నాటికి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. ఖమ్మం , నల్గొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులకు మేలు జరగనుంది. అంతేకాకుండా హయత్ నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఉపయోగపడనుంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొత్తం రూ.32 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..