హైదరాబాద్ మహానగరం మరో అంతర్జాతీయ క్రీడకు ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అవుతోంది. FIA ఫార్ములా Eని ఫిబ్రవరి 2023లో నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమువుతోంది. ఫార్ములా E ఛాంపియన్‌షిప్ తొమ్మిదో సీజన్ (2022-23)ను ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మెక్సికో తర్వాత ఫోర్త్ రేస్ పోటీలను భాగ్యనగరంలో, డబుల్ హెడర్‌లను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నారు.ఈమేరకు FIA వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ క్యాలెండర్‌లో హైదరాబాద్ ఈవెంట్‌కు ఆమెదముద్ర పడింది.
తాజాగా ఇదే విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రకటించారు. ఆయన మట్లాడుతూ, హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేశామని, 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగనుందని ఆయన అన్నారు. అలాగే, ఈవెంట్ కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొ్న్నారు.
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ వేశామని, ఇందులో సభ్యులుగా ఆనంద్ మహింద్రా, దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉన్నారని ఆయన అన్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎక్జిక్యూటివ్ కమిటీ వేశామని, ఇందులో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.
కాగా, గతంలో అంటే, 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫార్ములా వన్ (F-1) రేసును నిర్వహించారు. ఆ తర్వాత భారతదేశంలో నిర్వహించనున్న రెండవ అతిపెద్ద ప్రపంచ క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం. భారతదేశంలో FIA కోసం ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గమనార్హం. నగరంలో రేస్‌ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా ఈ అధికారులు ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ)పై సంతకం చేశారు.