48 రోజుల తరువాత హైదరాబాద్‌కు నీళ్లు కష్టమేనా..?

హైదరాబాద్ మరో చెన్నై కానుందా..? 48రోజుల తరువాత భాగ్యనగరానికి తాగు నీరు కష్టమేనా..? ఈ సంవత్సరం హైదరాబాద్ వాసులు నీటి ఇక్కట్లను ఎదుర్కోవాల్సిందేనా..? అంటే అధికారులు అవుననే అంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడు దోబూచులాడుతున్నాడు. దేశంలోని ఏ ప్రాంతంలోనూ కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో పై స్థాయి నుంచి నీరు రాకపోవడంతో హైదరాబాద్‌ జంట నగరాలకు నీరందించే రిజర్వార్లలో నీటి మట్టం అడుగుకు చేరింది. ప్రస్తుతం ఆ రిజర్వాయల్లో ఉన్న నీరు ఆగష్టు చివరికి […]

48 రోజుల తరువాత హైదరాబాద్‌కు నీళ్లు కష్టమేనా..?
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2019 | 3:16 PM

హైదరాబాద్ మరో చెన్నై కానుందా..? 48రోజుల తరువాత భాగ్యనగరానికి తాగు నీరు కష్టమేనా..? ఈ సంవత్సరం హైదరాబాద్ వాసులు నీటి ఇక్కట్లను ఎదుర్కోవాల్సిందేనా..? అంటే అధికారులు అవుననే అంటున్నారు.

వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడు దోబూచులాడుతున్నాడు. దేశంలోని ఏ ప్రాంతంలోనూ కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో పై స్థాయి నుంచి నీరు రాకపోవడంతో హైదరాబాద్‌ జంట నగరాలకు నీరందించే రిజర్వార్లలో నీటి మట్టం అడుగుకు చేరింది. ప్రస్తుతం ఆ రిజర్వాయల్లో ఉన్న నీరు ఆగష్టు చివరికి అయిపోయే అవకాశాలు ఉన్నాయి. గత జూలైతో పోలిస్తే ఈ జూలైలో అన్ని రిజర్వాయర్లలోని నీరు 12 అడుగుల మేర అడుగంటాయి.

తెలంగాణలో వర్షాకాలం ఆరంభమైనప్పటికీ.. సరైన వర్షాలు లేకపోవడంతో నాగార్జున సాగర్, శ్రీపాద యల్లంపల్లి, ఉస్మాన్ సాగర్, హిమయత్‌సాగర్‌ రిజర్వాయర్లలోకి నీరు చేరలేదు. మామూలుగా ఈ సమయానికి ఉన్న స్థానాల కంటే 5 నుంచి 10అడుగుల నీళ్లు ఉండాలని.. కానీ ఈ ఏడాది కనీసం ఒక్క అడుగు కూడా పెరగలేదని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ డైరక్టర్ టెక్నికల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక ప్రతి రోజు హైదరాబాద్‌కు199మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా.. రిజర్వాయర్లలో ఉన్న నీరు ఆగష్టు చివరి వరకు వస్తాయని ఓ అధికారి తెలిపారు. వీటితో పాటు మంజిరా, సింగూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. ఇవి ఇప్పటికే అడుగంటాయని.. మంజీరా బీడుగా మారిపోతుందని వారు పేర్కొన్నారు.

దీంతో ఆగష్టు తరువాత హైదరాబాద్‌ వాసులకు నీటిని ఎలా అందించాలా..? అని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ తలలు పట్టుకుంటున్నారు. కాగా ఈ సమస్యపై నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ డైరక్టర్ బీకే సిక్‌దర్ మాట్లాడుతూ.. నీటి ఇక్కట్లను తొలగించే దిశగా ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వినూత్న ఆలోచనలు, పరిష్కారాలతో ఈ సమస్యను ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు. కాగా రానున్న రెండు వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అప్పుడైనా సరిపడినంత వర్షాలు పడితే కాస్త ఊరట లభిస్తుందని.. లేకపోతే సెప్టెంబర్ నుంచి ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని అధికారులు అంటున్నారు.

కాగా తమిళనాడు రాజధాని చెన్నై నగరం ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. చెన్నైకు నీటిని సరఫరా చేసే అన్ని రిజర్వాయర్లలో భూగర్భజలాలు అడుగంటంతో చెన్నైవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అక్కడ వర్షాలు కురిసినప్పటికీ.. తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో ఇప్పటికీ.. అక్కడ నీటి ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి.