ఆమె ఓ ఆర్టిస్ట్.. అతనో జిమ్ ట్రైనర్.. ప్రేమగా మారిన తొలి పరిచయం.. కట్‌చేస్తే.. ఊహించని షాక్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ జిమ్ ట్రైనర్.. టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ను వంచించాడు. ప్రేమ పేరుతో ఆ యువతికి దగ్గరై ఆమె నుంచి డబ్బులు జేశాడు. తర్వాత ఆమెను దూరం పెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జూన్ 14న నిందితుడిని అరెస్ట్ చేసి అతనిపై చీటింగ్, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆమె ఓ ఆర్టిస్ట్.. అతనో జిమ్ ట్రైనర్.. ప్రేమగా మారిన తొలి పరిచయం.. కట్‌చేస్తే.. ఊహించని షాక్!
Hyd

Edited By:

Updated on: Jun 15, 2025 | 10:12 PM

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ జిమ్ ట్రైనర్.. టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి డబ్బులు కాజేసిన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువతి 2019లో హైదరాబాద్‌కు వచ్చి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంది. అయితే 2020లో ఆమెకు గాయత్రి హిల్స్‌లో ఉంటున్న ఓ జిమ్ ట్రైనర్‌తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం ప్రారంభించారు. గాయత్రి హిల్స్‌లో రెండు నెలలు.. మణికొండలో 2021 నుంచి 2022 మధ్య తొమ్మిది నెలలు కలిసి ఉన్నారు.

అయితే కొన్నాళ్ల తర్వాత ఆ జిమ్‌ ట్రైనర్‌ ఆ యువతిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో అతనికి తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని గమనించిన బాధితురాలు తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయింది. 2023 నవంబర్‌లో ఆమె తిరిగి హైదరాబాద్‌కు వచ్చి పీజీ హాస్టల్‌లో ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రైనర్ ఆమెను తిరిగి కాంటాక్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని.. ఖర్చుల కోసం రూ 15 లక్షలు అవసరమని చెప్పాడు. నమ్మకంతో ఆమె డిజిటల్ పేమెంట్స్ రూపేణ రూ7 లక్షలు పంపగా.. మరో రూ7 లక్షలు నగదుగా ఇచ్చింది.

అయితే, డబ్బు తీసుకున్న తర్వాత ట్రైనర్ మళ్లీ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్‌ చేస్తే రిప్లై ఇవ్వడం లేదు. దీంతో అనుమానం వచ్చి అతని గురించి విచారించగా అతనికి అప్పటికే వివాహం అయిందని తెలిసి బాధితురాలు కంగుతింది. ఆమె మోసపోయానని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అతనిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో జిమ్ ట్రైనర్ రూ. 5లక్షలు తిరిగి ఇచ్చాడు. మిగిలిన డబ్బు అడిగితే తప్పించుకు తిరుగుతుండడంతో బాధితురాలి జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. జిమ్‌ ట్రైనర్‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసి డబ్బులు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా BNS సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు జిమ్ ట్రైనర్‌ను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..