GHMC: హైదరాబాద్ మహా నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణంకోసం జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈనేపథ్యంలో పాదచారుల సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీహెచ్‌ఎంసీ పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుచేస్తోంది. ప్రజలు ఆయా సందర్భంలో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన నేపథ్యంలో విపరీతమైన రద్దీ కారణంగా రోడ్డు దాటడం ఎంతో కష్టంగా ఉంటోంది. చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలోనే అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జీహెచ్ఎంసీ కృషిచేస్తోంది. పెరుగుతున్న వాహన రద్దీని క్రమబద్ధీకరణ చేసేందుకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో పలు మార్పులు తీసుకొస్తుంది. అదే సమయంలో పాదచారుల భద్రత, ప్రమాదాల నివారణకు పెడేస్ట్రియన్ సిగ్నల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే వాహన దారుల సురక్షిత ప్రయాణం కోసం నూతన టెక్నాలజీ గల ట్రాఫిక్ సిగ్నల్స్ లను ఇప్పటి వరకు 334 ఏర్పాటు చేశారు.
స్విచ్ వేస్తేనే సిగ్నల్ పడేలా..
పాదచారులు ఇటు, అటు రోడ్డు దాటే సందర్భం లో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా సురక్షితంగా రోడ్డు దాటేందుకు పెలికాన్ సిస్టం ద్వారా పాదచారుల కోసం స్విచ్ వేస్తేనే సిగ్నల్ పడేలా వీటిని ఏర్పాటుచేశారు. కళాశాల, పాఠశాల, ఆస్పత్రులు, వ్యాపార వాణిజ్య సముదాయాలు ఇతర ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటుచేశారు. ప్రజల అవసరాల ఉన్న చోట్ల పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు బుష్ బటన్ సహకారంతో సిగ్నల్ పడగానే వాహనాలు ఆగిపోయి రోడ్డు క్రాస్ చేసే విధంగా ప్రజలకు వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలో 94 పెలికాన్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ ఏర్పాటే లక్ష్యం కాగా ఇప్పటివరకు 68 సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. మిగతావి పోలీస్ శాఖ ప్రతిపాదనలు రాగానే పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..