Telangana: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఈ ఏరియాలోనే.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..
హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. త్వరలోనే నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. నగరంలోని తూర్పు ప్రాంతంలో దీని రాకతో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఇప్పటికే డీపీఆర్ సిద్దం కాగా.. త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు. అనంతరం నిర్మాణ పనులు మొదలవుతాయి.

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ రానుంది. భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు అందుబాటులో ఉండగా.. మరికొన్ని ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని ఫ్లైఓవర్లు ప్రతిపాదన దశలో ఉండగా.. త్వరలో నిర్మాణ పనులకు మార్గం సుగమం కానుంది. అందులో భాగంగా మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ కొత్త ప్రాజెక్ట్ సహాయపడనుంది. అదే సాగర్ రింగ్ రోడ్ టూ బీఎన్ రెడ్డి నగర్ ఫ్లైఓవర్. త్వరలోనే పనులు ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సాగర్ రింగ్ రోడ్డు నుంచి బీఎన్ రెడ్డి నగర్ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. హస్తినపురం మీదుగా ఈ ఫ్లైఓవర్ వెళ్లనుంది. దాదాపు 3.2 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ చేపట్టనుండగా.. ఆరు లైన్లుగా ఉంటుంది. ప్రస్తుతం ఎల్బీనగర్-బీఎన్ రెడ్డి నగర్ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. విజయవాడ నేషనల్ హైవే, ఇన్నర్ రింగ్ రోడ్, మీర్ పేట్, బడంగ్ పేట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ భారీగా ఉంటుంది. దీని వల్ల సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్న దూరం ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఈ రూట్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త ఫ్లైఓవర్ వల్ల సాగర్ రింగ్ రోడ్ వద్ద వేచి ఉండే సమయం తగ్గుతుంది.
అలాగే ఎల్బీనగర్-బీఎన్ రెడ్డి నగర్ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. మీర్ పేట, బడంగ్ పేట వైపు రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రతీ రోజు ట్రాఫిక్‌తో ఇబ్బంది పడే వాహనదారులకు ఊరట కలగనుంది. అలాగే ఈ ఫ్లైఓవర్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా సమీప ప్రాంతాల్లో ఊపందుకోనుంది. అంబర్ పేట్, బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతుంది. ఇక షాపింగ్ కాంప్లెక్స్, కార్యాలయాలు వచ్చే అవకాశముంది. ఇళ్ల విలువ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ ఫ్లైఓవర్‌కు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. అనంతరం నిర్మాణ పనులు మొదలవుతాయి. ఇప్పటికే డీపీఆర్, తుది డిజైన్, అంచనా వ్యయం సిద్దమైంది.
