
గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఇటీవల భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నిస్తున్న ఒక నెట్‌వర్క్ గుట్టు రట్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. మొహియుద్దీన్ తన ఇంటిని ల్యాబ్‌గా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసి, మిగిలిన వ్యర్థాల నుంచి రైసిన్ విషరసాయనాన్ని తయారు చేయడానికి ప్రయత్నించినట్లు ఏటీఎస్ గుర్తించింది. రైసిన్ అత్యంత ప్రమాదకరమైన రసాయనం అని నిపుణులు చెబుతున్నాడు. కాగా మొహియుద్దీన్ ఉగ్ర కార్యకలాపాల కోసం రద్దీ ప్రాంతాలను పరిశీలించాడు. ఢిల్లీలోని ఆజాద్‌పుర్ మండీ, అహ్మదాబాద్‌లోని నరోడా ఫ్రూట్ మార్కెట్, లఖ్‌నవూ లోని ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసు వంటి ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఈ ప్రాంతాల్లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండటం వల్లే ఉగ్రదాడికి సరైన అవకాశముందని అతను భావించాడు.
గుజరాత్ ఏటీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురు నిందితులలో ప్రధాన సూత్రధారి మోహియుద్దీన్ సయ్యద్ (35). మోహియుద్దీన్ రైసిన్‌ను ఆయుధంగా మార్చే మార్గాలను పరిశీలిస్తూ ఉగ్రదాడి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడయ్యింది. మోహియుద్దీన్ బాగా చదువుకున్నాడని, అతను తీవ్రవాద భావజాలంతో భారీ ఉగ్రదాడి కోసం నిధులు సేకరించడం, వ్యక్తులను నియమించడం వంటి ప్రణాళికలను రూపొందించాడని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై మొహియుద్దీన్ కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ వారం క్రితం కాల్ చేసి.. తమ సోదరుడు ఉగ్ర కుట్రలో భాగంగా ఉన్నాడని తెలిపినట్లు టీవీ9తో మొహియుద్దీన్ సోదరుడు ఉమర్ చెప్పాడు. రెండు రోజుల పాటు అతడు ఉండే రూమ్‌లో ఎవరూ వెళ్లవద్దని సూచించనట్లు వివరించాడు. బిజినెస్ పేరుతో మోసం చేసి, ఉగ్ర కార్యకలాపాల్లో తమ సోదరుడ్ని లాగారని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. మొహియుద్దీన్ గతంలో ఎలాంటి కేసులు లేవని.. అతను ఉగ్ర కార్యకలాపాల్లో భాగం కాకూడదని ప్రార్థిస్తున్నట్లు ఉమర్ వెల్లడించాడు. దీని వెనుక ఎవరూ ఉన్నారో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నామని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.