Hyderabad Cricket Body Faces Police Case: హైదరాబాద్ క్రికెట్ టికెట్ ఇష్యూని పోలీసుల సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన హెచ్‌సీఏపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు.. మ్యాచ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకున్న ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. తొక్కిసలాటలో గాయపడ్డ అదితి ఆలియా, ఎస్‌ఐ ప్రమోద్ ఫిర్యాదులతో కేసులు పెట్టారు. ప్రధానంగా హెచ్‌సీఏపై టికెట్ నిర్వాహణ, బ్లాక్‌లో అమ్మారన్న ఆరోపణలపై సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఈ తొక్కిసలాటకు కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ ఇష్యూపై గాయపడ్డ వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ముందు నుంచి భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారంటూ అజారుద్దీన్‌పై ఆరోపణలు వచ్చాయి. టికెట్ల అమ్మకంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని, అందువల్లే జింఖానాలో తొక్కిసలాట జరిగిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెసీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదంటున్నారు.
ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో భారత్ – ఆసీస్ టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టికెట్ల అమ్మకాల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచే మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. టికెట్లు కొనుక్కునేందుకు ప్యారడైజ్ సర్కిల్ నుంచి జింఖానా వరకు క్యూలైన్ ఏర్పాటు చేశారు. అయితే, అంచనాలకు మించి వేలాదిగా క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఓ వైపు టికెట్స్ దొరుకుతాయో లేదోనన్న టెన్షన్.. మరోవైపు కౌంటర్ బంద్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో గందరగోళం మొదలైంది.
టికెట్ల అమ్మకం స్లోగా జరగడం, ఆన్‌లైన్ పేమెంట్స్‌కు అనుమతించకపోవడంతో అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా గేటెక్కి లోపలికి తోసుకుపోయేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాట జరిగి.. జింఖానా మొత్తం హాహాకారాలతో నిండిపోయింది. లాఠీచార్జిలో పదిమందికి గాయాలయ్యాయి. బాధితుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. తొక్కిసలాటలో పద్మ అనే మహిళ స్పృహ తప్పిపోయింది. వెంటనే అక్కడున్న మహిళా కానిస్టేబుల్ ఆమెకు సీపీఆర్ ట్రీట్‌మెంట్ ఇచ్చి ఊపిరందేలా చేశారు.
కాగా.. జింఖానాగ్రౌండ్ తొక్కిసలాటపై సీరియస్‌గా స్పందించింది తెలంగాణా సర్కార్. టిక్కెట్ల కేటాయింపుపై వెంటనే సమీక్షకు రావాలని HCAను ఆదేశించింది. స్టేడియం కెపాసిటీ ఎంత, ఎన్ని టిక్కెట్లు ఉన్నాయి, ఎన్నిటిని ఆన్‌లైన్‌లో పెట్టారు. టోటల్ సినారియో చెప్పాలని ఆదేశించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రివ్యూ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. తెలంగాణా ప్రతిష్టను మసకబారిస్తే సహించబోమన్నారు. అటు.. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా HCAనే తప్పుబడుతోంది. ఘటన మొత్తంలో హెచ్‌సీఏ నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు అడిషనల్ డీసీపీ. బాధ్యులెవరైనా యాక్షన్ తీసుకునే తీరతామని స్పష్టంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం