Hyderabad police alert in Old City: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్నాడని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను చంపడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటనపై హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్, పాతబస్తీ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేశారు. కాగా.. నూపుర్‌శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇద్దరు దుండగులు టైలర్ దుకాణంలోకి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కొలతలు తీసుకుంటున్న టైలర్‌ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తరువాత ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హంతకులకు కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. టైలర్ హత్య తర్వాత పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్ట్ చేశారు. ఇద్దరు హంతకులు ఈ మర్డర్ తరువాత వీడియో కూడా రిలీజ్ చేశారు. దుస్తులు కుట్టించుకుంటాననే నేపంతో హంతకులు అతని దుకాణానికి వచ్చి హత్య చేశారు. అంతేకాదు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
ఈ ఘటన తర్వాత రాజస్థాన్ లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.. ఉదయ్‌పూర్‌లో షాపులన్నింటినీ మూసి వేశారు. ఈ దుర్ఘటనతో ఉదయ్ పూర్ ఒక్కసారిగా భగ్గుమంది.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక బీజేపీ డిమాండ్ చేసింది.. పరిస్థితి తీవ్రత గుర్తించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ రంగంలోకి దిగారు.. నిందితులకు శిక్షపడుతుందని ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. దయచేసి ఎవరూ ఉద్రిక్తపూరితమైన వ్యవహారాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..