Telangana Corona updates: కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొన్ని ఆసుపత్రుల తీరు మారడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోగులకు ఫీజులు వేస్తున్నాయి. ఆసుపత్రి స్టాంప్ కూడా లేకుండా తమకు తోచినంత ఫీజును వసూలు చేస్తున్నాయి.
ఇటీవల మాదాపూర్‌లో రామన్‌జిత్ అనే వ్యక్తి తన స్నేహితుడి సోదరుడికి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ తన స్నేహితుడికి రూ.10.2లక్షల బిల్లును వేశారని రామన్‌జిత్ తెలిపారు. పేమెంట్ చేసిన తరువాత కంప్యూటరైజ్డ్ బిల్లును ఇచ్చారని అతడు వెల్లడించారు. ఒక రోగి ఎంతమేరకు ఫీజు కట్టగలడు అని అంచనా వేసి మరీ ఆసుపత్రి యాజమాన్యం బిల్లులు వేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
ఇక తన తమ్ముడికి కరోనా రాగా.. బేగంపేటలోని ఓ ఆసుపత్రిలో చేర్పించామని, అతడికి అధిక ఫీజును వేశారని మరో వ్యక్తి ఆరోపిస్తున్నారు. అంతేకాదు కంప్యూటరైజ్డ్ బిల్లులో ఆసుపత్రి పేరు కూడా లేదని చెప్పారు. వారికి తోచినంత డబ్బులను రోగుల నుంచి వసూలు చేస్తున్నారు, అలాగే పేరును బయటకు రాకుండా చూసుకుంటున్నారు అంటూ ఆ వ్యక్తి చెబుతున్నారు. కాగా ఇవొక్కటే కాదు చాలా ఆసుపత్రులు బిల్లులో జీఎస్టీ ఛార్జీలను చూపడం లేదు. ఈ క్రమంలో అవినీతి నిరోధక ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ సాయితేజ అనే వ్యక్తి జీఎస్టీ కమిషనరేట్‌కి లేఖ రాశారు. హైదరాబాద్ చుట్టూ పక్కల పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని అందులో వెల్లడించారు. ఇక దీనిపై స్పందించిన యాంటీ ఎవేషన్ సెక్షన్ అసిస్టెంట్ కమిషనర్.. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Read More: